Homeనేషనల్Al Qaeda Warning: 9/11కు వారం ముందే అల్‌ఖైదాపై హెచ్చరిక

Al Qaeda Warning: 9/11కు వారం ముందే అల్‌ఖైదాపై హెచ్చరిక

నాటి జాతీయ భద్రతా సలహాదారు కండోలీజా రైస్‌కు రిచర్డ్ క్లార్క్ లేఖ
ఆర్కైవ్ పత్రాల్లో ఆసక్తికర విషయాలు వెల్లడి

- Advertisement -

వాషింగ్టన్, (తెలుగుప్రభ): అమెరికా చరిత్రలోనే అత్యంత చీకటిరోజుగా మిగిలిపోయిన 2001 సెప్టెంబర్ 11 (9/11) ఉగ్రదాడులకు సరిగ్గా వారం రోజుల ముందే శ్వేతసౌధానికి అత్యంత తీవ్రమైన హెచ్చరిక అందినట్లు నాటి పత్రాల ద్వారా వెల్లడైంది. అప్పటి వైట్‌హౌస్ సిబ్బంది రిచర్డ్ ఏ. క్లార్క్.. జాతీయ భద్రతా సలహాదారు కొండోలీజా రైస్‌కు ఈ విషయంపై ప్రత్యేకంగా నోట్ పంపినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. 2000 అక్టోబర్‌లో యూఎస్‌ఎస్ కోల్‌పై దాడిలో 17 మంది అమెరికన్లు మరణించిన తర్వాత క్లార్క్ అల్‌ఖైదాపై కఠిన చర్యల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2001 జనవరిలో రైస్‌కు పంపిన మెమోలో అల్‌ఖైదాను ‘‘చురుకైన, వ్యవస్థీకృత, ప్రధాన శక్తి’’గా ఆయన అభివర్ణించారు.

‘అమెరికా సీరియస్‌గా ఉందా?’

9/11కు వారం ముందు అల్‌ఖైదాపై అమెరికా నిజంగా కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటుందా? అని క్లార్క్ రైస్‌ను ప్రశ్నించారు.
యెమెన్‌లో జరిగిన యూఎస్‌ఎస్ కోల్ దాడికి అమెరికా ప్రతీకారం తీర్చుకోకపోవడం అల్‌ఖైదా, తాలిబన్‌లకు ధైర్యం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. అమెరికన్లను చంపినా ఎలాంటి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదని ఆ సంస్థలు భావించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో అమెరికా సహా పలు దేశాల్లో వందలాది మంది అమెరికన్లు అల్‌ఖైదా దాడుల్లో మరణించిన తర్వాత.. ‘‘ముందుగానే ఏం చేసి ఉండాల్సింది?’’ అని నిర్ణయాధికారులు ఆలోచించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఆఫ్ఘనిస్థాన్‌కు ప్రాధాన్యం లేదని భావిస్తున్న పెంటగాన్‌, సీఐఏపై కూడా క్లార్క్ విమర్శలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయాత్మక చర్యలను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. ఆ సమావేశంలో ప్రధానంగా ఆఫ్ఘనిస్థాన్‌పై ‘ప్రిడేటర్’ నిఘా డ్రోన్ విమానాలను మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలనే అంశంపైనే చర్చ జరిగింది. అయితే సమావేశం ముగిసే సమయానికి దీనిపై నిర్ణయం తీసుకోలేకపోయారు.

రైస్ ఏమన్నారు?

తరువాత 9/11 కమిషన్ ముందు రైస్.. క్లార్క్ పంపిన మెమో మంచి హెచ్చరికేనని అంగీకరించారు. అయితే జాతీయ భద్రతా మండలి సిబ్బందిగా తొమ్మిదేళ్లు పనిచేసిన క్లార్క్.. తన ప్రతిపాదనలను ఇతరులు, సంస్థలు ఆమోదించకపోవడంతో నిరాశకు గురయ్యారని ఆమె పేర్కొన్నారు. అల్‌ఖైదాపై వ్యూహం ఫలితాలు ఇవ్వడానికి సుమారు మూడేళ్లు పట్టొచ్చని తాను అప్పట్లో భావించినట్లు రైస్ తరువాత తెలిపారు. కానీ ఆ సంస్థ అంతకంటే చాలా ముందుగానే దాడి చేసింది. 2001 సెప్టెంబర్ 11న జరిగిన దాడులు అమెరికా చరిత్రనే కాకుండా ప్రపంచ రాజకీయాలు, భద్రతా వ్యవస్థను శాశ్వతంగా మార్చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News