Muslim marriage new rules India :ముస్లిం సమాజంలో పాతుకుపోయిన కొన్ని దురాచారాలపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ఉక్కుపాదం మోపింది. సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుడుతూ, పెళ్లిళ్లలో కట్నం తీసుకోవడాన్ని, విందులలో నిలబడి భోజనం చేయడాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ వేదికగా జరిగిన ఉలమాల సమావేశంలో ఈ మేరకు ఒక “ముస్లిం అజెండా”ను విడుదల చేసింది. ఈ నిర్ణయాలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతాయా లేక క్షేత్రస్థాయిలో మార్పుకు నాంది పలుకుతాయా?.. ఈ అజెండాలోని ఇతర కీలక అంశాలేంటి..?
బరేలీ వేదికగా కీలక అజెండా : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, ఇస్లామిక్ పండితులకు, దర్గా ఆలా హజ్రత్‌కు ప్రసిద్ధి. ఇక్కడి ఇస్లామియా ఇంటర్ కాలేజ్ మైదానంలో సోమవారం జరిగిన “ఆలా హజ్రత్ ఉలమా” సదస్సు ఈ చారిత్రక నిర్ణయాలకు వేదికైంది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ, వేలాదిగా హాజరైన ఉలమాలు, ప్రజల సమక్షంలో ఈ “ముస్లిం అజెండా”ను ఆవిష్కరించారు. సమాజంలోని చెడును రూపుమాపేందుకు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నడపాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
అజెండాలోని ముఖ్యమైన అంశాలు: మౌలానా షహబుద్దీన్ రజ్వీ ప్రకటించిన ఈ అజెండా, ముస్లిం సమాజంలోని పలు కీలక సమస్యలను ప్రస్తావించింది.
కట్నంపై నిషేధం: “వివాహాల కోసం కట్నం తీసుకోవడం పవిత్ర ఖురాన్‌కు విరుద్ధం. ఈ దురాచారానికి ముస్లింలు తక్షణమే స్వస్తి పలకాలి,” అని స్పష్టం చేశారు.
నిలబడి భోజనం వద్దు: “వివాహాలు, ఇతర వేడుకల్లో నిలబడి భోజనం చేసే (బఫే) పద్ధతిని ఆపాలి. ఇది కూడా మన సంస్కృతికి, మత గ్రంథాలకు విరుద్ధం,” అని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాలపై యుద్ధం: యువతలో మాదకద్రవ్యాల వ్యసనం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోరాడాలని పిలుపునిచ్చారు.
వడ్డీ వ్యాపారానికి దూరం: ముస్లింలలో కొందరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారని, ఇస్లాంలో ఇది నిషేధమని గుర్తు చేస్తూ, దానిని మానుకోవాలని సూచించారు.
దుబారా ఖర్చులకు కళ్లెం: “వివాహాలు, ఇతర కార్యక్రమాలలో అనవసరమైన, వృథా ఖర్చులను మానుకోవాలి. ఆ డబ్బును పిల్లల విద్య కోసం వెచ్చించాలి. అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది,” అని హితవు పలికారు. ఈ దురాచారాలపై ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఉలేమాలు ఉద్యమం నిర్వహిస్తారని రజ్వీ స్పష్టం చేశారు.
బరేలీ పేరు మార్చాలని డిమాండ్ : ఈ సామాజిక సంస్కరణలతో పాటు, మౌలానా రజ్వీ మరో కీలక డిమాండ్‌ను ప్రభుత్వం ముందుంచారు. “బరేలీ నగరం ఆలా హజ్రత్ నగరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి, బరేలీ రైల్వే జంక్షన్‌కు ‘బరేలీ షరీఫ్ ఆలా హజ్రత్ రైల్వే జంక్షన్’ అని, విమానాశ్రయానికి ‘ఆలా హజ్రత్ విమానాశ్రయం’ అని పేరు మార్చాలి,” అని ఆయన డిమాండ్ చేశారు.


