All-Women Cop Team Does First-Ever Encounter: నేర నియంత్రణలో పురుష పోలీసులకే పరిమితమైన ఎన్‌కౌంటర్ వంటి చర్యల్లో ఇప్పుడు మహిళా పోలీసులు కూడా తమ సత్తా చాటారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో తొలిసారిగా మహిళా పోలీస్ బృందం ఒక నేరస్థుడిని ఎన్‌కౌంటర్ చేసి అరెస్ట్ చేసింది. స్నాచింగ్, దోపిడీ, దొంగతనం వంటి అనేక కేసుల్లో నిందితుడైన 22 ఏళ్ల జితేంద్రను అరెస్ట్ చేయడంతో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది.
ALSO READ: Food Poison: దేశ రాజధానిలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 200 మందికి అస్వస్థత
గాజియాబాద్ నంద్‌గ్రామ్ ఏసీపీ ఉపాసన పాండే తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఎన్‌కౌంటర్ సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు ఒక చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జితేంద్రను ఆపడానికి ప్రయత్నించారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో జితేంద్ర తన వాహనంపై నియంత్రణ కోల్పోయి కింద పడిపోయాడు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా, జితేంద్ర వారిపై కాల్పులు జరిపాడు.
దీంతో అప్రమత్తమైన మహిళా పోలీసు బృందం ఎదురు కాల్పులు జరపగా, జితేంద్ర కాలుకు గాయమైంది. వెంటనే అతడిని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం జరిపిన విచారణలో జితేంద్ర ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో బైకులు, స్కూటర్లు దొంగిలిస్తున్నట్లు అంగీకరించాడు. అంతేకాకుండా, ఫోన్లు, ఇతర వస్తువులను కూడా స్నాచింగ్ చేసేవాడినని చెప్పాడు. నిందితుడి నుంచి పోలీసులు ఒక పిస్టల్, ఒక స్కూటర్, ఒక ఫోన్, ఒక టాబ్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
జితేంద్ర విచారణలో మాట్లాడుతూ, తనను పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో తాను వాడిన ద్విచక్ర వాహనం గత సంవత్సరం ఢిల్లీలో దొంగిలించబడిందని, అలాగే తన దగ్గర దొరికిన ఫోన్, టాబ్లెట్‌ను ఆదివారం స్నాచింగ్ చేశానని తెలిపాడు. మహిళా పోలీసులకు దక్కిన ఈ విజయం వారి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని చాటిచెప్పింది. ఈ ఘటన పట్ల గాజియాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరాలను పంచుకున్నారు.
ALSO READ: Nepo Kids: మనీశ్ ‘నెపో కిడ్స్’ ట్వీట్‌పై బీజేపీ విమర్శ.. ‘కొంచెం ఎదగండి’ అని కాంగ్రెస్ కౌంటర్


