Amarnath Yatra: జమ్మూకాశ్మీర్‌లో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి శ్రీ అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూలై 19 నుండి జూలై 23 వరకు ఈ ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ముందుజాగ్రత్త చర్యగా యాత్రను ఆపేసినట్లు కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ తెలిపారు. అమర్‌నాథ్ యాత్రతో పాటు భక్తుల రక్షణ దృష్ట్యా ప్రసిద్ధ వైష్ణోదేవి యాత్రను కూడా అధికారులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
బేస్ క్యాంపుల్లో ఆంక్షలు: పహల్గాం, బల్తాల్ రెండు మార్గాల ద్వారా సాగే అమర్‌నాథ్ యాత్రపై వాతావరణ ప్రభావం పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి బల్తాల్, చందన్‌వారీ బేస్ క్యాంపుల నుంచి భక్తులు ముందుకు వెళ్లడానికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి బేస్ క్యాంపుల వైపునకు వెళ్లే ఎలాంటి అమర్‌నాథ్ యాత్రికుల కాన్వాయ్‌లను కూడా అనుమతించేది లేదని కమిషనర్ అన్షుల్ గార్గ్ స్పష్టం చేశారు.
Also Read-Vaishakha Shuddha Navami: భారతీయ మహిళకు ప్రతిరూపం సీతమ్మ తల్లి
ఇప్పటివరకు 3.76 లక్షల మంది దర్శనం: మొత్తంగా 57 రోజుల పాటు సాగనున్న ఈ సుదీర్ఘ పుణ్యయాత్రలో ఇప్పటివరకు 3.76 లక్షలకు పైగా భక్తులు అమర్‌నాథ్ మంచు లింగాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించని కారణంగా భక్తులెవరూ బేస్ క్యాంపుల నుంచి ముందుకు రావద్దని సూచించారు. అధికారులు భద్రతను నిర్ధారించి వాతావరణ సమీక్ష జరిపిన తర్వాతే యాత్ర పునఃప్రారంభంపై స్పష్టత ఇస్తారని జమ్మూకాశ్మీర్ యంత్రాంగం పేర్కొంది. భక్తులు తాజా సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

