Ambulance Runs out fuel : డీజిల్ అయిపోవడంతో రోగిని ఆస్పత్రికి తీసుకువెలుతున్న అంబులెన్స్ నడిరోడ్డుపై ఆగిపోయింది. సకాలంలో వైద్యం అందక రోగి మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఆ రాష్ట్రంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలలో గల వ్యత్యాసాలను ఈ ఘటన బహిర్గతం చేసింది.
తేజియా(40) అనే వ్యక్తి బన్స్వారా జిల్లా దానాపూర్ గ్రామంలో నివసిస్తున్న కూతురు ఇంటికి వచ్చాడు. గత మూడు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. గురువారం పొలం పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పక్కనున్న వారు అంబులెన్స్‌కు కాల్ చేశారు. అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో అతడిని జిల్లా ఆసుపత్రికి తీసుకువెలుతున్నారు. గ్రామం నుంచి 10-12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్లం రోడ్ టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే అంబులెన్స్ ఒక్కసారిగా ఆగిపోయింది.
ఏమైందని బంధువులు అంబున్స్ డ్రైవర్‌ను ప్రశ్నించగా డీజిల్ అయిపోయినట్లు చెప్పాడు. తేజియా ప్రాణాలు కాపాడేందుకు అతడి కుటుంబ సభ్యులు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పెట్రోల్ బంకు వరకు అంబులెన్స్‌ను తోసుకుంటూ వెళ్లారు. అక్కడ రూ.500 విలువ గల డీజిల్‌ను కొట్టించారు. అయినప్పటికీ అంబులెన్స్ స్టార్ కాలేదు. దీంతో మరో అంబులెన్స్‌కు కాల్ చేశారు. గంట తరువాత వచ్చిన ఆ అంబులెన్స్‌లో తేజియా ను ఆస్పత్రికి తరలించారు.
ఆయన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. దీంతో తేజియా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అంబులెన్స్ని వారు నెడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లో వైద్య సౌకర్యాల నెటీజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.