Amit Shah’s strong message on counter-terrorism : జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులను మతం అడిగి మరీ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న పాశవిక ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో తీవ్రమైన స్వరంతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన “ఆపరేషన్ మహదేవ్” వివరాలను వెల్లడిస్తూనే, ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించి “ఉగ్రవాదులకు మతం అంటగట్టి ఆవేదన చెందవద్దు” అంటూ చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి.
పక్కా వ్యూహంతో ఉగ్రవాదుల వేట.. పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన నేపథ్యంలో, భద్రతా బలగాలు తక్షణమే రంగంలోకి దిగాయని అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదులు దేశ సరిహద్దులు దాటి పారిపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. “ఆపరేషన్ సిందూర్” పై లోక్‌సభలో జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా “ఆపరేషన్ మహదేవ్”ను ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఈ నెల 22న దాచిగామ్ సమీపంలోని మహదేవ్ పర్వత ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి కచ్చితమైన సమాచారం అందింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన భద్రతా దళాలు, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో, పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారి అయిన సులేమాన్ షాతో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని అమిత్ షా సభకు వివరించారు.
అయితే, తన ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు పదేపదే అడ్డుతగలడంతో అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించి, “ఉగ్రవాదుల మతం చూసి మీరు బాధపడొద్దు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఉగ్రవాద చర్యలను ఖండించాల్సింది పోయి, వారిని వెనకేసుకువచ్చే ప్రయత్నం చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.
పాకిస్థాన్‌ను ఎందుకు సమర్థిస్తున్నారని ప్రతిపక్షాలను ఆయన సూటిగా ప్రశ్నించారు. “మీరు పాకిస్థాన్‌తో చర్చలు జరుపుతారా?” అని నిలదీశారు. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “పాకిస్థాన్‌ను రక్షించడం ద్వారా మీకు ఏం లభిస్తుంది..?” అని ప్రశ్నించారు. హతమైన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందినవారేనని తాము ఆధారాలతో సహా వెల్లడిస్తే, దానికి రుజువేంటని చిదంబరం ప్రశ్నించడాన్ని షా గుర్తుచేశారు. ఉగ్రవాదుల వద్ద పాకిస్థాన్‌లో తయారైన చాక్లెట్లు లభించాయని, ఇంతకంటే ఆధారం ఏం కావాలని ఆయన అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాదులను హతమార్చినందుకు దేశ ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా హర్షం వ్యక్తం చేస్తాయని తాను భావించానని, కానీ వారి తీరు చూస్తుంటే ఉగ్రవాదులను తుదముట్టించడం వారికి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదనిపిస్తోందని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు.


