Amit Shah on Congress : సార్వత్రిక ఎన్నికల వేడి ఇంకా చల్లారకముందే, రాజకీయ మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా, ప్రతిపక్ష కాంగ్రెస్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరుస ఓటములతో హస్తం పార్టీ నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిందని ఎద్దేవా చేసిన ఆయన, ఏకంగా విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి, ఆయన గత తీర్పులను ప్రశ్నించడం సంచలనం రేపుతోంది. ఇంతకీ కాంగ్రెస్‌పై షా చేసిన ప్రధాన ఆరోపణలేంటి? పార్లమెంట్‌లో భద్రతపై ఆయన ఇచ్చిన వివరణ ఏమిటి? ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అంత తీవ్రమైన విమర్శలు చేయడానికి కారణమైన ఆ ‘సల్వా జుడుం’ తీర్పు కథేంటి?
“వరుస ఓటములతో కాంగ్రెస్‌లో నిరాశ” : ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ, వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశలో ఉందని అన్నారు. “ఓటమి భారం నుంచి బయటపడలేక, ప్రజల్లో లేనిపోని భ్రమలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ వారి మాటలను ప్రజలు నమ్మరు. ఎందుకంటే మాకు ప్రజలతో ఉన్న ప్రత్యక్ష సంబంధం వారి కంటే వందల రెట్లు ఎక్కువ. మేము యాదృచ్ఛికంగా అధికారంలోకి రాలేదు, ప్రజా క్షేత్రంలో పనిచేసి వచ్చాం,” అని షా స్పష్టం చేశారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై ‘సల్వా జుడుం’ అస్త్రం : అమిత్ షా తన విమర్శల పదును పెంచుతూ, విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయనో వామపక్ష సానుభూతిపరుడని, ఆయన ఇచ్చిన ఒకే ఒక్క తీర్పు వల్ల నక్సలిజం మరో రెండు దశాబ్దాలు మనుగడ సాగించిందని ఆరోపించారు.
“విపక్ష కూటమి ఒక వామపక్ష భావజాల సానుభూతిపరుడిని తమ అభ్యర్థిగా నిలబెట్టింది. 2011లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మావోయిస్టులపై పోరాడేందుకు ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన యువతతో ఏర్పాటు చేసిన ‘సల్వా జుడుం’ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. విద్య, రోడ్లు కోరుకునే ఆదివాసీలు తమ ఆత్మరక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అది. ఆ తీర్పుతో గిరిజనుల ఆత్మరక్షణ హక్కును కాలరాశారు. చనిపోయే దశలో ఉన్న నక్సలిజానికి ఆ తీర్పు ఆక్సిజన్ పోసింది. దీనికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కంటే ముందు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి,” అని అమిత్ షా డిమాండ్ చేశారు.
పార్లమెంట్‌లో సీఐఎస్ఎఫ్.. స్పీకర్‌దే తుది నిర్ణయం : పార్లమెంట్‌లో విపక్షాల నిరసనలను అణచివేసేందుకే సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారన్న ఆరోపణలను అమిత్ షా తోసిపుచ్చారు. “పార్లమెంటు లోపల భద్రత ఎవరి చేతిలో ఉండాలనేది పూర్తిగా స్పీకర్ పరిధిలోని అంశం. గతంలో ఢిల్లీ పోలీసులు ఉండేవారు, ఇప్పుడు సీఐఎస్ఎఫ్ ఉంది. వారు సభలోకి అడుగుపెట్టిన తర్వాత, వారిని పోలీసులుగా కాకుండా ‘మార్షల్స్’గా పరిగణిస్తారు. వారు కేవలం స్పీకర్ ఆదేశాల మేరకే పనిచేస్తారు,” అని షా స్పష్టత ఇచ్చారు.


