ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్(Encounter) చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించినట్టు బస్తర్ ఏరియా ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఎక్స్ వేదికగా స్పందించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే దిశగా భద్రతాదళాలు భారీ విజయాన్ని సాధించాయని చెప్పారు.
‘‘ఛత్తీస్‌గఢ్‌లో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. అలాగే పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. నక్సలిజాన్ని అంతం చేసే ప్రయత్నంలో ఇద్దరు జవాన్లనూ కోల్పోయాం. ఈ అమరవీరులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామనే సంకల్పాన్ని కూడా పునరుద్ఘాటిస్తున్నాను’’ అని అమిత్ షా పేర్కొన్నారు. మరోవైపు భద్రతాబలగాల ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ తెలిపారు.