Amit Shah meet NIA and IB chiefs: దిల్లీ కారు బాంబు పేలుడు ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇది ఉగ్ర కుట్రే అనే అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కీలక భేటీ ప్రారంభం అయ్యింది. ఎన్‌ఐఏ, ఐబీ చీఫ్‌లతో హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. దిల్లీ పేలుడు దర్యాప్తుపై కేంద్ర హోంమంత్రి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. దిల్లీ పేలుడిపై ప్రాథమికంగా అందిన సమాచారం, ఉగ్ర సంస్థల ప్రమేయం, భారీ కుట్రపై ఈ భేటీలో సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్‌తో పాటుగా దిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.
దిల్లీ పేలుడు ఉగ్ర కుట్రే: దిల్లీ బాంబు పేలుడు వెనుక ఉగ్రమూలాలు ఉన్నట్లు బయటపడింది. ఫరీదాబాద్‌లో భారీఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు, దీనికి సంబంధం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ కేసు పూర్తి దర్యాప్తు బాధ్యతల్ని దిల్లీ పోలీసుల నుంచి ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ) తీసుకుంది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రోస్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడులో మృతుల సంఖ్య 13కి చేరింది. ఘటనా స్థలిలోనే 9 మంది మరణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. అయితే ఘటనా స్థలంలో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు కేవలం ఇద్దరిని మాత్రమే గుర్తించినట్టుగా తెలుస్తోంది. వారిలో ఒకరు ఉత్తర్‌ప్రదేశ్, మరొకరు దిల్లీకి చెందినవారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మిగిలినవారి వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వారి వయసు 28-58 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. గాయపడిన 20 మందిలో 12 మంది దిల్లీవాసులుగా పోలీసులు గుర్తించారు.
Also Read:https://teluguprabha.net/national-news/nia-takes-charge-of-delhi-bomb-blast-investigation/
పేలుడుకు కారకులైనవారిలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హెచ్చరించారు. భద్రతాబలగాల ప్రతాపమేంటో వారికి చూపిస్తామని అన్నారు. దిల్లీతోపాటు దేశవ్యాప్త పరిస్థితులపై ఆయన ఉన్నతస్థాయిలో రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. అంగోలా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పేలుడుపై దర్యాప్తు వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తామని ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టం ముందు నిలబెడతామని అన్నారు.


