Amit Shah strong Warning to Maoist: కేంద్ర హోం మంత్రి అమిత్షా మావోయిస్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. భద్రతాదళాలు వారిపై ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించబోవని హామీ ఇచ్చారు. ఢిల్లీలో ‘నక్సల్ రహిత భారత్’పై నిర్వహించిన సెమినార్ ముగింపు సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గందరగోళం సృష్టించేందుకే మావోయిస్టుల నుంచి ఇటీవల ఓ లేఖ బయటకు వచ్చింది. ఇప్పటివరకు జరిగింది పొరపాటు అని, కాల్పుల విరమణ ప్రకటించాలని, తాము లొంగిపోవాలనుకుంటున్నామని అందులో పేర్కొన్నారు. ఒకవేళ మావోయిస్టులు లొంగిపోవాలనుకుంటే.. కాల్పుల విరమణ అవసరం లేదు. ఆయుధాలను వీడి ముందుకు రండి. ఒక్క బుల్లెట్ కూడా పేలదు. రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతాం. పునరావాసం కల్పిస్తాం’’ అని అమిత్ షా తెలిపారు. అభివృద్ధి లేకపోవడమే మావోయిస్టు హింసకు దారితీసిందనే వామపక్షాల వాదనలను తోసిపుచ్చారు. ఈ హింస కారణంగానే దేశంలోని అనేక ప్రాంతాలు దశాబ్దాల తరబడి అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయన్నారు.
మార్చి 31 నాటికి నక్సలిజం అంతం చేస్తాం..
‘‘దేశంలో నక్సలిజం సమస్య ఎందుకు తలెత్తింది? వారికి సైద్ధాంతిక, ఆర్థిక, చట్టపరమైన మద్దతును ఎవరు అందిస్తున్నారు? వీటన్నింటినీ అర్థం చేసుకోనంత వరకు.. నక్సలిజంపై పోరాటం ముగియదు. మావోయిస్టుల హింసపై మౌనం వహించిన వామపక్ష పార్టీలు.. ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ కగార్’ను ప్రారంభించినప్పుడు మాత్రం మానవ హక్కుల గురించి మాట్లాడటం ప్రారంభించాయి. మావోయిస్టులను ఆ పార్టీలు ఎందుకు రక్షించాలి? గిరిజన బాధితుల హక్కులను కాపాడేందుకు నక్సల్ సానుభూతిపరులు ఎందుకు ముందుకు రారు?’’ అని అమిత్ షా ప్రశ్నించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామని పునరుద్ఘాటించారు. కాగా, ఆపరేషన్ కగార్ ధాటికి మావోయిస్టులు కకావికలమవుతున్నారు. కొంతమంది ఎన్‌కౌంటర్‌లో చనిపోతుండగా, మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయుధాలు వదిలేసి లొంగిపొతామని కొందరు ప్రకటన చేస్తుండగా.. మరికొందరు మాత్రం చర్చలకు పిలవాలని పట్టు పడుతున్నారు. ఈ విషయంపై మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై వ్యాఖ్యలు చేశారు. కాగా, కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. వరసగా కేంద్ర నాయకత్వం భద్రతా దళాల చేతిలో హతమవుతున్నారు. మే నెలలో నారాయణపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 25 మంది మావోయిస్టులు మరణించారు. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు హతమయ్యాడు. గత వారం జార్ఖండ్ హజారీ బాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సహదేవ్ సోరెన్‌తో పాటు మరో ఇద్దరు మావోలు హతమయ్యారు. సహదేవ్‌పై రూ. 1 కోటి రివార్డు ఉంది. ఈ ఘటనల తర్వాత సీనియర్ కేంద్ర కమిటీ సభ్యురాలు, సీనియర్ లీడర్ కిషన్ జీ భార్య పోతుల పద్మావతి అలియాస్ సుజాత నాలుగు దశాబ్ధాల అజ్ఞాతం తర్వాత లొంగిపోయింది.


