Amitabh Bachchan Getting Warning Calls from SFJ: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. దీంతో, ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర నిఘా సంస్థలు ఆయన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ముంబైలోని ఆయన నివాసం వద్ద భద్రతను భారీగా పెంచేందుకు అన్ని చర్యలు చేస్తోంది. అమితాబ్ బచ్చన్‌కు “సిక్స్ ఫర్ జస్టిస్” అనే ఖలిస్తానీ సంస్థ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్‌జిత్ దోసాంజ్ కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అమితాబ్ పాదాలకు నమస్కరించడంతో ఈ వివాదం మొదలైంది. దిల్‌జిత్, అమితాబ్ పాదాలకు నమస్కరించడం అనేది.. 1984 నాటి సిక్కుల వ్యతిరేక హింసలో మరణించిన వారిని అవమానించినట్లేనని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) సంస్థ ఆరోపించింది. 1984 నాటి ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన హింసలో అమితాబ్ బచ్చన్ ‘రక్తం బదులు రక్తం’ అనే నినాదాన్ని ఇచ్చి హిందువులను ప్రేరేపించారని ఎన్‌ఎఫ్‌జే ఆరోపిస్తోంది. అటువంటి వ్యక్తి పాదాలను పంజాబీ గాయకుడు దిల్‌జిత్ తాకడాన్ని ఎస్‌ఎఫ్‌జే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Also Read: https://teluguprabha.net/national-news/nda-releases-manifesto-promises-1-crore-government-job/
సీరియస్‌గా తీసుకున్న కేంద్ర నిఘా వర్గాలు..
కాగా, ఖలిస్తానీ సంస్థ అధినేత గుర్‌పత్వంత్ సింగ్ పన్నూన్ ఈ బెదిరింపులకు పాల్పడినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, భద్రతకు ముప్పు పొంచి ఉందనే అంచనాతో కేంద్ర ప్రభుత్వం ముంబైలోని అమితాబ్ బచ్చన్ నివాసం వద్ద భద్రతను భారీగా పెంపుదల చేయాలని నిర్ణయించింది. కేంద్ర నిఘా ఏజెన్సీలు ఈ బెదిరింపులను అత్యంత సీరియస్‌గా తీసుకుని, అమితాబ్ బచ్చన్‌కు గట్టి భద్రతను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాగా, పన్నూన్ ఇటీవల విడుదల చేసిన ఓ వీడియోలో దిల్‌దిత్ చర్యను తీవ్రంగా ఖండించాడు. “1984లో సిక్కుల మారణహోమానికి బాధ్యత వహించిన వారిలో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. ఆయన కాళ్లు మొక్కడం అనేది సిక్కుల చరిత్రను అవమానించడం, బాధితులకు ద్రోహం చేయడం.” అని పేర్కొన్నాడు. కాగా, ఎస్‌ఎఫ్‌జే సంస్థ ఆస్ట్రేలియాలో నవంబర్ 1న జరగనున్న దిల్జిత్ సంగీత కచేరీని అడ్డుకుంటామని ప్రకటించింది. అలాగే సిక్కుల అత్యున్నత ధార్మిక సంస్థ అకల్ తఖ్త్ జతేదార్‌కు లేఖ రాసి, దిల్జిత్‌ను పిలిపించి వివరణ కోరాలని డిమాండ్ చేసింది. ఈ వివాదం కొనసాగుతున్నప్పటికీ, దిల్జిత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన ‘ఆరా టూర్’ లో బిజీగా ఉన్నారు. సిడ్నీలో జరిగిన ఆయన కచేరీకి 30 వేల మందికి పైగా అభిమానులు హాజరై రికార్డు సృష్టించారు. టికెట్లు మొత్తం అమ్ముడైపోగా, కొన్ని టికెట్లు 800 డాలర్ల వరకు విక్రయం జరిగింది.


