Amitabh Bachchan’s biggest fan story : అభిమానం ఏ స్థాయికి వెళ్లగలదు? ఇష్టమైన నటుడి కోసం ఓ వ్యక్తి తన జీవితాన్నే మార్చుకుంటాడా? భార్య పేరును, కొడుకు పేరును, చివరికి తన ఇంటి పేరును కూడా మార్చేస్తాడా? అవును, అక్షరాలా ఇదే నిజం! బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌పై అభిమానంతో ఓ వ్యక్తి తన జీవితాన్నే ‘బచ్చన్ మయం’ చేసుకున్నాడు. రోజూ రెండు పూటలా దేవుడికి చేసినట్లు పూజలు చేస్తాడు, హారతి ఇస్తాడు. కానీ ఇప్పటివరకు తన ఆరాధ్య దైవాన్ని కనీసం కంటితో కూడా చూడలేదు. అసలు ఎవరీ వీరాభిమాని..? అతని వింత కథేంటి..?
బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్‌కు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన మున్నాలాల్ పాల్ కథ మాత్రం ప్రత్యేకం. అతనికి బిగ్ బీ అంటే అభిమానం కాదు, పిచ్చి… భక్తిభావం. అమితాబ్‌ను తన సొంత అన్నయ్యగా భావించే మున్నాలాల్, ఆయన కోసం తన సర్వస్వాన్ని మార్చుకున్నాడు.
‘రోటీ కప్డా ఔర్ మకాన్’తో మొదలైన ప్రస్థానం : 1970లలో విడుదలైన ‘రోటీ కప్డా ఔర్ మకాన్’ సినిమా చూసిన తర్వాత మున్నాలాల్ జీవితం మారిపోయింది. ఆ చిత్రంలో అమితాబ్ నటనకు ఫిదా అయిపోయాడు. ఆ సినిమా స్ఫూర్తితో BSFలో చేరాలని ప్రయత్నించినా, శారీరకంగా అర్హత సాధించలేకపోయాడు. అప్పటి నుంచి అమితాబ్ నటించిన ప్రతి సినిమాను చూడటం, ఆయననే అనుకరించడం ప్రారంభించాడు.
కుటుంబం మొత్తం ‘బచ్చన్’మయం : మున్నాలాల్ అభిమానం కేవలం సినిమాల వరకే పరిమితం కాలేదు, తన కుటుంబంలోకి కూడా ప్రవేశించింది.
భార్య పేరు ‘జయ’: పెళ్లి చేసుకోగానే, తన భార్యకు అమితాబ్ సతీమణి పేరు మీద ‘జయ’ అని పేరు మార్చాడు.
ఇళ్ల పేర్లు ‘ప్రతీక్ష, జల్సా’: కష్టపడి ఇల్లు కట్టుకుని, దానికి అమితాబ్ ఇంటి పేరైన ‘ప్రతీక్ష’ అని పెట్టుకున్నాడు. రెండో ఇల్లు కట్టినప్పుడు, దానికి ‘జల్సా’ అని నామకరణం చేశాడు.
కొడుకు పేరు ‘అభిషేక్’: తన కొడుకుకు ‘అభిషేక్’ అని పేరు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో స్థానికంగా వారి కుటుంబాన్ని అందరూ ‘అమితాబ్ బచ్చన్ కుటుంబం’ అని పిలుచుకుంటారు. మున్నాలాల్ ఇళ్లంతా అమితాబ్ ఫోటోలు, పోస్టర్లతో నిండిపోయి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అమితాబ్ చిత్రపటాల ముందు దీపం వెలిగించి, స్వయంగా రాసిన పాటతో హారతి ఇస్తాడు.
అమితాబ్ పుట్టినరోజు ఓ పండుగే : ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న వచ్చే అమితాబ్ బచ్చన్ పుట్టినరోజును మున్నాలాల్ ఓ పెద్ద పండుగలా జరుపుతాడు. ఇంటిని సర్వాంగ సుందరంగా అలంకరించి, బిగ్ బీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తాడు. చుట్టుపక్కల వారిని పిలిచి టీ, స్నాక్స్, భోజనాలు ఏర్పాటు చేస్తాడు. పిల్లలకు చాక్లెట్లు, పెన్నులు పంచిపెడతాడు.
‘మర్ద్’ గుర్రపు బండితో సేవ : అమితాబ్ నటించిన ‘మర్ద్’ చిత్రంలోని మూడు చక్రాల గుర్రపు బండిని పోలిన ఆటో-రిక్షాను ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు మున్నాలాల్. దానిపై తిరుగుతూ, అప్పుడప్పుడు డబ్బులు లేని పేదలను ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తాడు. అమితాబ్ బచ్చన్ ఓసారి తీవ్రంగా గాయపడినప్పుడు, ఆయన త్వరగా కోలుకోవాలని ఏడు రోజుల పాటు కఠిన ఉపవాసం ఉన్నానని మున్నాలాల్ గుర్తుచేసుకున్నాడు.
ఒకే ఒక్క కోరిక : రెండున్నర దశాబ్దాలుగా అమితాబ్ కోసం ఆరాటపడుతున్న మున్నాలాల్‌కు ఉన్న ఒకే ఒక్క కోరిక, జీవితంలో ఒక్కసారైనా తన ఆరాధ్య నటుడిని కలవడం. అయితే, దానికోసం ఇప్పటివరకు అతడు ఎలాంటి తీవ్ర ప్రయత్నాలు చేయలేదు. తన కొడుకు కోరిక నెరవేరాలని, అతనికి ఒక్కసారైనా అమితాబ్‌ను కలిసే అవకాశం రావాలని మున్నాలాల్ తల్లిదండ్రులు, స్థానికులు కోరుకుంటున్నారు.


