తమిళనాడు ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. కోయంబత్తూర్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష తమిళం అని తెలిపారు. అలాంటి మహోన్నత భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలి ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే(DMK) ఓడిపోయి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఏపీ, హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమపై సంపూర్ణ నమ్మకంతో అధికారం కట్టబెట్టారని గుర్తు చేశారు. తమిళనాడు మరింత అభివృద్ధి చెందాలంటే డబల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు.
కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం(National Education Policy)పై తమిళనాడు, కేంద్రం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళులపై హిందీ బలవంతంగా రుద్దితే ఊరుకోమని డీఎంకే కేంద్రానికి స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో అమిత్ షా స్వయంగా తమిళులకు బహిరంగ క్షమాపణలు చెప్పడం తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.