Sunday, November 16, 2025
Homeనేషనల్From Mud to Medals: మట్టిలో మాణిక్యాలు.. అమరావతి గడీలో అంతర్జాతీయ పహిల్వాన్లు!

From Mud to Medals: మట్టిలో మాణిక్యాలు.. అమరావతి గడీలో అంతర్జాతీయ పహిల్వాన్లు!

Amravati wrestling training center : ఒక శతాబ్దానికి పైగా చరిత్ర.. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పురుడుపోసుకున్న ఆవరణ.. మట్టిలో పొర్లాడినా, మ్యాట్‌పై పోరాడినా పతకమే లక్ష్యం. మహారాష్ట్రలోని ఓ గ్రామీణ ప్రాంతం, అంతర్జాతీయ స్థాయి మల్లయోధులను దేశానికి అందిస్తోంది. 111 ఏళ్లుగా నిర్విరామంగా కుస్తీ యోధులను తయారుచేస్తున్న ఆ కేంద్రం కథేంటి? మట్టి కుస్తీల నుంచి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల వరకు వారి ప్రస్థానం ఎలా సాగింది..? ఆ విజయాల వెనుక ఉన్న రహస్యం ఏమిటి..?

- Advertisement -

స్వాతంత్య్ర స్ఫూర్తితో.. శతాబ్దాల శిక్షణ : విదర్భ ప్రాంతంలోని అమరావతి నగరంలో ఉన్న ‘శ్రీ హనుమాన్ వ్యాయం ప్రసారక్ మండల్’ కేవలం ఒక శిక్షణా కేంద్రం కాదు, అదొక చారిత్రక కట్టడం. యువతను స్వాతంత్య్ర పోరాటం వైపు నడిపించాలనే మహోన్నత లక్ష్యంతో అంబదస్‌పంత్ వైద్య, అనంత్ వైద్య అనే సోదరులు 111 ఏళ్ల క్రితం దీనికి ప్రాణం పోశారు. నాటి నుంచి నేటి వరకు అదే స్ఫూర్తిని, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ మండల్.. దేశానికి ఎందరో మేటి రెజ్లర్లను అందిస్తోంది.

మట్టి నుంచి మ్యాట్‌ వరకు.. శిక్షణలో వైవిధ్యం : ఈ కేంద్రంలో శిక్షణకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పురాతన, ఆధునిక పద్ధతులకు సమ ప్రాధాన్యం ఇస్తారు. సంప్రదాయ పద్ధతిలో రెజ్లర్లు ఒంటికి మట్టి పూసుకుని, చెరువుల్లో సాధన చేస్తూ తమ శక్తిసామర్థ్యాలకు పదును పెట్టుకుంటారు. అదే సమయంలో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 40 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉన్న మ్యాట్‌పై ‘ఫ్రీస్టైల్’, ‘గ్రీకో-రోమన్’ వంటి ఆధునిక విభాగాల్లోనూ శిక్షణ ఇస్తారు. రెజ్లింగ్ విభాగ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ తిరత్కర్ చెప్పినదాని ప్రకారం, ఈ కేంద్రం 1975లోనే భారత్-రష్యా అంతర్జాతీయ పోటీలకు వేదికైంది. ఎందరో అనుభవజ్ఞులైన మల్లయోధులు ఈ మట్టిని సందర్శించి వెళ్లారని ఆయన గుర్తుచేసుకున్నారు.

పతకాల పంట పండిస్తున్న పహిల్వాన్లు : ఈ శిక్షణా కేంద్రంలో తయారైన రెజ్లర్లు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగానూ సత్తా చాటుతున్నారు. ఖేలో ఇండియా కోచ్ జితేంద్ర భూయార్ మాట్లాడుతూ, పిల్లలు వెనకబడకుండా వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామన్నారు. ఈ కేంద్రం నుంచి వచ్చిన అనిల్ టోర్కాడ్ 2013లో సెర్బియా, స్లోవేకియాలలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రెండేళ్లకు, 2015లో బోస్నియా, హెర్జెగోవినాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 50 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించి దేశ కీర్తి పతాకను రెపరెపలాడించాడు. ఈ విజయం వెనుక కఠోర శ్రమతో పాటు పాలు, ఓట్స్, జీడిపప్పు, బాదం, చికెన్, జున్ను, పండ్లతో కూడిన పౌష్ఠికాహారం కీలక పాత్ర పోషిస్తుందని రెజ్లర్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad