Saturday, November 15, 2025
HomeTop StoriesVantara Business Secret అనంత్ అంబానీ వంతారా వెనుక సీక్రెట్ వ్యాపారం ఇదే

Vantara Business Secret అనంత్ అంబానీ వంతారా వెనుక సీక్రెట్ వ్యాపారం ఇదే

Vantara Business Secret మీరందరూ ఇటీవల వినే ఉంటారు.. అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ప్రాజెక్టు గురించి. అటు బిల్‌గేట్స్ కూడా ఏకంగా 2.5 లక్షల ఎకరాల భూమి ఎందుకు కొనుగోలు చేశాడనే ప్రశ్న రావచ్చు. వంతారా ద్వారా అనంత్ అంబానీ పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాడనో లేదా జంతు ప్రేమికుడనో భావించవచ్చు. మీడియా కూడా ఇదే హైలైట్ చేసింది. కానీ అసలు సంగతి వేరే లెవెల్ ఉంది. చెట్ల ద్వారా భవిష్యత్తులో వేల కోట్లు ఆర్జించే పక్కా కమర్షియల్ ప్రాజెక్టు ఇది. అదే కార్బన్ క్రెడిట్స్ వ్యాపారం. అవును..తెర వెనుక చాలా పెద్ద వ్యవహారమే నడిచింది. రానున్న 10-15 ఏళ్లలో చెట్ల ద్వారా వేల కోట్లు ఆర్జించే పరిస్థితి ఉంది. వంతారా అందులో భాగమే.

- Advertisement -

అసలు కార్బన్ క్రెడిట్స్ అంటే ఏమిటి, ఎలా వ్యాపారం జరుగుతుంది

చెట్లను పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండనే మాట మనం తరచూ వింటుంటాం. ఎందుకంటే మనిషికి హాని కల్గించే కార్బన్ డై ఆక్సైడ్ లేదా కార్బన్ ఉద్గారాలను చెట్లు సంగ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తుంటాయి. కార్బన్ డై ఆక్సైడ్ సంగ్రహించే శక్తి చెట్టుని బట్టి మారుతుంటుంది. వాతావరణంలో CO2ను తగ్గించే సామర్ధ్యం ఆధారంగా కార్బన్ క్రెడిట్స్ సమకూరుతాయి. ఈ కార్బన్ క్రెడిట్స్‌ను అమ్ముకోవడం ద్వారా డబ్బులు ఆర్జించవచ్చు.

ఉదాహరణకు ఓ కంపెనీకు ప్రభుత్వం ఏడాదికి 100 టన్నుల కంటే ఎక్కువ కార్బన్ ఉద్గారాలు విడుదల చేయకూడదని నిర్ణయించిందనుకోండి. ఆ కంపెనీ నిర్ణీత పరిమితి కంటే అధికంగా 50 టన్నులు విడుదల చేస్తే కాలుష్య నియంత్ర మండలి నిబంధన ప్రకారం జరిమానా విధిస్తారు లేదా ఆ కంపెనీపై చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు కొత్త చట్టం ద్వారా ఆ కంపెనీ అదనంగా విడుదల చేసిన కార్బన్ ఉద్గారాలకు ప్రతిగా కార్బన్ క్రెడిట్స్ జమ చేస్తే సరిపోతుంది. ఈ కార్బన్ క్రెడిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి…ఇదే ఇప్పుడు వ్యాపారం..

అనంత్ అంబానీ చేసింది ఇదే. 3 వేల ఎకరాల్లో దాదాపుగా 4 లక్షల చెట్లు నాటాడు. ఇందులో 6 వందల ఎకరాల్లో 1.30 లక్షల చెట్లు మామిడి రకం ఉన్నాయి. ఎందుకంటే మామిడి ఆకులకు కార్బన్ అధిక స్థాయిలో సంగ్రహించే సామర్ధ్యం ఉంటుంది. ప్రతి మామిడి చెట్లు 50 ఏళ్లలో 20 టన్నుల కార్బన్ తగ్గిస్తుందని అంచనా. వంతారాలో అనంత్ అంబానీ పెంచిన 4 లక్షల మొక్కలకు దాదాపుగా 80 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించే సామర్ధ్యం ఉంటుంది. ఒక టన్నుకు ఒక కార్బన్ క్రెడిట్ జమ అవుతుంది. వీటిని అనంత్ అంబానీ ఇతర కంపెనీలకు విక్రయించుకోవచ్చు. వంతారా ప్రాజెక్టుకు ఉన్న సామర్ద్యం లెక్కలు అంచనా వేస్తే అనంత్ అంబానీ ఈ ప్రాజెక్టు ద్వారా 1000 కోట్లు ఆర్జించవచ్చు. అనంత్ అంబానీ వంతారా ప్రాజెక్టు రానున్న కాలంలో రిలయన్స్ సంస్థకు ఓ గోల్డ్ మైన్ కానుందనేది ఓ వాదన.

కాలుష్యం కూడా ఓ వ్యాపార వస్తువు

ఇండియాలో కాలుష్యం కూడా ఓ వ్యాపార వస్తువుగా మారుతోంది. ప్రతి మొక్క మీకు ఆదాయాన్ని సమకూర్చనుంది. ఇండియా తొలిసారిగా నేషనల్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ మార్కెట్ లాంచ్ చేసింది. దీనికోసం రూపొందించిన చట్టం 2026 మధ్యనాటికి అమల్లోకి రానుంది. ప్రతి టన్ను కార్బన్ డై ఆక్సైడ్‌కు ధర నిర్ణయించడమే కాకుండా ఈ సీవో2ను తగ్గించే లేదా తొలగించేవారికి రివార్డులు ఇవ్వడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం. ఫారెస్ట్ పెంచడం లేదా సోలార్ ప్లాంట్లు, గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ద్వారా ఏ రూపంలో అయినా సరే కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు.

కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ సూక్ష్మంగా చెప్పుకోవాలంటే CCTS. ధృవీకరించిన గ్రీన్ ప్రాజెక్టులకు కార్బన్ క్రెడిట్స్ ఆర్జించి పెడుతుంది. ఈ క్రెడిట్లను కార్బన్ ఉద్గారాలను అధికంగా విడుదల చేసే కంపెనీలు కొనుగోలు చేయవచ్చు. ఇది కేవలం క్లైమేట్ పాలసీ మాత్రమే కాదు..ఓ కొత్త ఆర్ధిక విధానం. 2024 నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2030 నాటికి 10-15 బిలియన్ డాలర్లు ఆర్జించవచ్చని అంచనా.

ఇండియా కార్బన్ మార్కెట్ ఎందుకు లాంచ్ చేసింది…

ఇండియాలో ప్రతి సంవత్సరం 2.9 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతోంది. ప్రపంచ కార్బన్ విసర్జిత దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉంది. తీవ్రమైన ప్రకృతి ప్రతికూలతలు ఉన్న దేశంగా మారుతోంది. వరదలు, కరవు, వడగాల్పులు, తుపానుల కారణంగా దేశంలో 2015 నుంచి ఇప్పటి వరకు 7లక్షల కోట్ల నష్టం జరిగింది.

ఈ క్రమంలో 2070 నాటికి జీరో టార్గెట్ ఛేదించే దిశగా ఇండియాలో ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రావల్సి ఉంది. అధికంగా కార్బన్ ఉద్గారాలు విడుదల చేసే కంపెనీలు క్రెడిట్స్ కొనుగోలు చేయడం ద్వారా ఎకో బ్యాలెన్స్ అవుతుంది.

ఇండియాల కార్బన్ మార్కెట్ రాత్రికి రాత్రి ప్రత్యక్షం కాలేదు. చట్ట సవరణ ద్వారా నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ చట్టాన్ని 2023 జూన్‌లో తీసుకొచ్చారు. 2024 నాటికి నిబంధనలు సిద్ధమయ్యాయి. 2025 మార్చ్ నాటికి 8 కార్బన్ విధానాలను ఆమోదించింది. తద్వారా ఎనర్జీ ఎక్స్చేంజ్‌లుగా ఉన్న ఐఈఎక్స్, పీఎక్స్ఐఎల్‌లో ట్రేడింగ్‌కు మార్గం సుగమమైంది.

కార్బన్ క్రెడిట్స్‌కు ఆమోదం పొందిన ప్రాజెక్టు రకాలు

1. రినెవెబుల్ ఎనర్జీ ( సోలార్, విండ్ మరియు హైడ్రో)
2. గ్రీన్ హైడ్రోజన్
3. ఇండస్ట్రియల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ
4. ల్యాండ్‌ఫిల్ మీథేన్ రికవరీ
5. వ్యర్ధాల నుంచి ఎనర్జీ ప్లాంట్స్
6. మాంగ్రూవ్ అడవులు, అటవీకరణ
7. క్లీనర్ ఇండస్ట్రియల్ విధానాలు
8. ఆగ్రో ఫారెస్ట్ ప్రాజెక్టులు

ఇండియాలో కార్బన్ మార్కెట్ నడిపేది ఎవరు

ఇక్కడ ఏదీ ఉచితం కాదు. ఇండియన్ కార్బన్ మార్కెట్ కఠినంగా ఉంటుంది. ఇంధన శాఖ నేషనల్ క్లైమేట్ పాలసీను నడిపిస్తుంది. క్రెడిట్స్ మంజూరు చేయడం,ప్రాజెక్టులను ఆమోదించడం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ చేస్తుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ రిజిస్టర్డ్ ఎక్స్చేంజ్‌ల ట్రేడింగ్‌ను రెగ్యులేట్ చేస్తుంది. ప్రతి లావాదేవీ నేషనల్ కార్బన్ రిజిస్ట్రీలో నమోదవుతుంది.

కార్బన్ క్రెడిట్ ధర

ప్రతి టన్ను సీవో2కు కార్బన్ క్రెడిట్ ఉంటుంది. దీని ధర టన్నుకు 150 నుంచి 2500 రూపాయల వరకు మార్కెట్ ఆధారంగా డిమాండ్‌ను బట్టి మారుతుంటుంది.

గ్రామాల్లో రైతులకూ అవకాశం

ఇది బడా కార్పొరేట్ సంస్థలకే కాదు సామాన్య రైతులు, గ్రామస్థులు కూడా లబ్ది పొందగలిగిన వ్యాపారం. రైతులు తమ పంట పొలాల్ని రిజిస్టర్ చేసుకుంటే అందులోని మొక్కలకుండే కార్బన్ సంగ్రహణ సామర్ధ్యం ద్వారా కార్బన్ క్రెడిట్స్ మంజూరవుతాయి. ఈ క్రెడిట్స్ విక్రయించుకుని అదనపు ఆదాయం పొందవచ్చు.

ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని మాంగ్రూ అడవులను ఇప్పటికే నేషనల్ కార్బన్ రిజిస్ట్రీలో నమోదు చేశారు. ఈ అడవులుప్రతి హెక్టార్‌కు ఏడాదికి 8-15 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ను సంగ్రహిస్తాయని అంచనా.

ప్రస్తుతం ఈ మార్కెట్‌పై ప్రవేట్ సంస్థలు కన్నేశాయి. జేఎస్‌డబ్ల్యూ వందల ఎకరాల్లో చెట్లు నాటుతోంది. అదానీ కూడా కార్బన్ మార్కెట్ క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టాటా పవర్ అయితే రూఫ్ టాప్ సోలార్ విధానం ద్వారా కార్బన్ క్రెడిట్స్ ఆర్జించే ప్రయత్నంలో ఉంది.

కార్బన్ క్రెడిట్స్ అనేది డిజిటల్ వ్యాపారంగా పరిగణించవచ్చు. నేషనల్ కార్బన్ రిజిస్ట్రీలో టైమ్ స్టాంప్ వేసి భద్రపర్చడం ద్వారా మార్కెట్‌లో ట్రేడ్ చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. అంటే ఇక ఇండియాలో ప్రతి చెట్టు ఆదాయం సమకూర్చి పెడుతుంది. చెట్లు ఇకపై ప్రగతికే కాదు ఆదాయానికి మెట్లు కానున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad