Anmol Bishnoi deportation to India : భారత్‌తో పాటు కెనడాలోనూ అనేక హత్యలు, కిడ్నాప్‌లు, బ్లాక్‌మెయిల్‌ల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్న లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన కీలక సభ్యుడు, లారెన్స్ బిష్ణోయ్‌కి స్వయానా తమ్ముడు అయిన అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా నుంచి భారత్‌కు తరలిస్తున్నారు. ఈ పరిణామం వ్యవస్థీకృత నేరాలను అరికట్టడంలో ఒక కీలక ముందడుగుగా పరిగణిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య, బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటనతో పాటు అనేక హై ప్రొఫైల్ కేసుల్లో నిందితుడైన అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా అధికారులు భారత దర్యాప్తు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న చట్టపరమైన ప్రక్రియలు, భద్రతాపరమైన ఏర్పాట్లను పూర్తి చేసిన అనంతరం అన్మోల్‌ను భారత్‌కు రప్పించనున్నారు.
అమెరికా ‘చెక్’ – అన్మోల్ బిష్ణోయ్ బహిష్కరణ : అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పంపిన ఒక ఈమెయిల్ ద్వారా అన్మోల్ బిష్ణోయ్‌ను నవంబర్ 18న అధికారికంగా అమెరికా నుంచి బహిష్కరించినట్లు వెల్లడైంది. ఈ మెయిల్‌ను బాబా సిద్ధిఖీ కుమారుడు, ఎన్‌సీపీ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీకి పంపారు. ఈ బహిష్కరణ ద్వారా అన్మోల్ బిష్ణోయ్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియకు మార్గం సుగమం అయింది. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న బిష్ణోయ్ ముఠాను అణచివేసే దిశగా ఇది ఒక కీలక పురోగతి అని అధికారులు చెబుతున్నారు. భారత్‌లో అతడిపై ఉన్న కేసులన్నింటిని విచారించేందుకు పోలీసులు ఇప్పటికే సిద్ధమయ్యారు.
జైలు నుంచే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు : లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికే గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఖైదీగా ఉన్నాడు. అయితే జైలు నుంచే లారెన్స్ తన గ్యాంగ్‌ను నడిపిస్తున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. భారత్‌తో పాటు విదేశాల్లోనూ హత్యలు, దోపిడీలు, ఆయుధాలు, డ్రగ్స్ రవాణా వంటి నేర కార్యకలాపాలతో లారెన్స్ బిష్ణోయ్, అతడి ముఠా పేరుగాంచింది. అన్మోల్ బిష్ణోయ్ భారత్‌కు అప్పగింతతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధించిన మరిన్ని రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
అన్మోల్ బిష్ణోయ్‌పై ఉన్న కీలక కేసులు, రివార్డులు : జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అన్మోల్ బిష్ణోయ్‌పై రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. 2022లో నమోదైన రెండు కేసుల్లో అతడు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్యకు ముందు షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ అన్మోల్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టడం కూడా అతని నేర చరిత్రకు అద్దం పడుతోంది. ఈ కేసులన్నింటిలోనూ అన్మోల్ బిష్ణోయ్ పాత్రపై లోతైన విచారణ జరిపేందుకు భారత దర్యాప్తు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.
బిష్ణోయ్ గ్యాంగ్‌పై కెనడా ‘ఉగ్రవాద’ ముద్ర : ఇటీవలే కెనడా ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. తమ దేశంలో హింస, ఉగ్రవాద చర్యలకు స్థానం లేదని కెనడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా నిర్దిష్ట వర్గాలను లక్ష్యంగా చేసుకొని భయం, బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే కార్యకలాపాలకు తమ దేశంలో చోటులేదని పేర్కొంది. భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజీత్ డోభాల్ ఇటీవల కెనడా ఎన్‌ఎస్‌ఏ నథాలీ డ్రౌయిన్‌తో విస్తృత సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయంతో కెనడాలోని బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఆస్తులు, వాహనాలు, స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యక్రమాలకు నిధుల సేకరణ, వివిధ నేరాలకు సంబంధించిన కేసుల్లో బిష్ణోయ్ ముఠా సభ్యులను విచారణతో పాటు ముఠా సభ్యులపై ఆ దేశ పోలీసులు నిఘా ఉంచనున్నారు. ఈ అంతర్జాతీయ సహకారం వ్యవస్థీకృత నేరాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

