Trilokpuri Murder Case: శ్రద్ధా హత్యకేసు తరహాలోనే ఢిల్లీలో దారుణ హత్యకేసు వెలుగులోకి వచ్చింది. త్రిలోక్‌పురిలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల, చేతులు, కాళ్లు, పలు శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు అంజన్ దాస్ గా గుర్తించారు. బీహార్ కు చెందిన వ్యక్తి అని, చాలాకాలంగా ఢిల్లీలోనే నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే, భార్య, సవతి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ పోలీసులు ఈ కేసు విషయాలను మీడియాకు వెల్లడించారు. జూన్ 5న రాంలీలా మైదాన్‌లో శరీర భాగాలు లభించాయని, వాటిని ఐదు రోజులకు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు. మృతదేహాన్ని గుర్తించడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. సాంకేతిక విశ్లేషణ అనంతరం మృతదేహాన్ని గుర్తించారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్ తర్వాత అంజన్ దాస్ తప్పిపోయినట్లు 5-6 నెలలుగా తేలింది, అయితే మిస్సింగ్ రిపోర్టు పోలీస్ స్టేషన్‌లో నమోదు కాలేదన్నారు. మృతుడి భార్య పూనమ్, సవతి కుమారుడు దీపక్ అనుమానితులుగా తేలిందన్నారు.
పూనమ్ 2017లో అంజన్ దాస్‌ని పెళ్లాడింది. ఆమె మొదటి భర్త పేరు కల్లు. కల్లు కొడుకు దీపక్. పూనమ్‌కి కల్లుకు చెందిన ఒక కుమార్తె కూడా ఉంది. కల్లు క్యాన్సర్‌తో మరణించిన తర్వాత, పూనమ్ అంజన్ దాస్‌తో కలిసి జీవించడం ప్రారంభించింది. అంజన్ దాస్‌కు కూడా అప్పటికే పెళ్లై ఎనిమిది మంది పిల్లలు బీహార్‌లో ఉన్నారు. అంజన్ దాస్ పూనమ్ నగలను అమ్మి బీహార్ కు పంపాడు. అతను కూడా సంపాదించలేదు. పూనమ్ మీద మాత్రమే ఆధారపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
అంజన్ దాస్ తన కూతురు, కోడలు (దీపక్ భార్య)పై కూడా వంకరబుద్ధితో చూస్తున్నాడని పూనమ్‌కు అనుమానం వ్చచింది. దీంతో చంపేయాలని తల్లీ కొడుకులు నిర్ణయించుకున్నారు. మే30న ఇద్దరూ కలిసి అతనికి నిద్రమాత్రలు వేసి మద్యం తాగించారు. స్పృహతప్పి పడిపోయిన వెంటనే దీపక్ గొంతు కోశాడు. మరుసటి రోజు మృతదేహాన్ని సుమారు 10 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రదేశాల్లో పడేశారు. జూన్ 5వ తేదీ సాయంత్రం పోలీసులు మృతదేహం కాలును గుర్తించారు. తలను గొయ్యి తవ్వి పూడ్చిపెట్టారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని, నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు