Homeనేషనల్Rajya sabha : పేపర్ లీకేజీ కేసులకు 5 నెలల గడువు... రాజ్యసభ వేదికగా అధికార,...

Rajya sabha : పేపర్ లీకేజీ కేసులకు 5 నెలల గడువు… రాజ్యసభ వేదికగా అధికార, ప్రతిపక్షాల పోరు!

Anti Paper Leak Bill 2026 Rajya Sabha Debate : లక్షలాది మంది నిరుద్యోగ యువత నిరంతర శ్రమను, వారి కళ్లలోని కలలను ఒక్క పేపర్ లీకేజీ ఆవిరి చేసేస్తోంది. “పరీక్ష రాయడం కంటే… లీకు రాయుళ్ల బారి నుంచి ఫలితాలను కాపాడుకోవడమే పెద్ద అగ్నిపరీక్షగా” మారిన వేళ, దేశ అత్యున్నత చట్టసభ వేదికగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఒక కీలక అడుగు పడింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదముద్ర పొందిన ‘సార్వజనిక పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు’  గురువారం రాజ్యసభ ముందుకు రావడంతో సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధం సాగింది. 

- Advertisement -

రాజ్యసభలో నిప్పులు చెరిగిన మాటల సమరం : కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… నిత్యం జరిగే లీకేజీల వల్ల కంటిమీద కునుకు లేకుండా చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులే దారుణంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. ఆర్టికల్ 370 రద్దుకు 70 ఏళ్లు పట్టిందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిబంధనలు తీసుకరావడానికి ప్రతిపక్షాల వైఖరి వల్ల 33 ఏళ్ల సమయం వృథా అయిందని నిలదీశారు. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటే… తమ స్వార్థ ప్రయోజనాలు ప్రమాదంలో పడుతున్నాయనే నెపంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని విమర్శించారు.

ఐదు నెలల్లోనే నిగ్గు తేల్చేలా కఠిన నిబంధనలు : కొత్తగా ప్రతిపాదించిన చట్ట సవరణల ప్రకారం పేపర్ లీకేజీ కేసుల్లో న్యాయవిచారణ అత్యంత వేగంగా పూర్తవుతుందని మంత్రి స్పష్టం చేశారు:
2 నెలల దర్యాప్తు గడువు: కేసు నమోదైన నాటి నుంచి దర్యాప్తు సంస్థలు (ఉదాహరణకు సీబీఐ) రెండు నెలల వ్యవధిలోనే విచారణ, విచారణాధికారుల ప్రశ్నోత్రాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
3 నెలల్లో స్పెషల్ కోర్టుల విచారణ: ఛార్జ్‌షీట్ దాఖలైన తర్వాత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మూడు నెలల్లోనే విచారణను పూర్తి చేసి తీర్పు వెలువరించాలి.

మొత్తం 5 నెలల్లో పరిష్కారం: ఫిర్యాదు అందిన రోజు నుంచి సరిగ్గా ఐదు నెలల వ్యవధిలోనే బాధ్యులకు శిక్ష పడేలా చట్టభద్రత కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సవరణల ప్రకారం వ్యక్తిగత అక్రమాలకు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల వరకు జరిమానా, అలాగే వ్యవస్థీకృత నేరాలకు కనీసం 7 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానాలు విధిస్తారు.

నీట్’ లీకేజీ కేసుపై సీబీఐ స్పీడ్… చార్జ్‌షీట్ దాఖలు : ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యుజి (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కాలయాపన చేయకుండా సీబీఐకి అప్పగించిందని జితేంద్ర సింగ్ వెల్లడించారు. మే 8న సమాచారం అందగా, మే 12 నాటికే కేసును సీబీఐకి బదిలీ చేశామని తెలిపారు. ఈ కేసులో ఎన్‌టీఏ సబ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ నిర్వాహకులు మరియు మధ్యవర్తులతో సహా 13 మంది కీలక నిందితులను అరెస్ట్ చేసి, 92 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. సీబీఐ ఇప్పటికే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్‌షీట్ సమర్పించిందని, కొత్త చట్ట నిబంధనల ప్రకారమే వీరిపై విచారణ ప్రారంభమైందని సభకు వివరిస్తూ, నిందితులకు కఠిన శిక్ష పడటం ఖాయమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News