Saturday, November 15, 2025
Homeనేషనల్Silence Broken: ఎనిమిదేళ్లుగా మాట్లాడలేని బాలుడికి... 8 వారాల్లో మాటలు నేర్పిన ఆర్మీ డాక్టర్!

Silence Broken: ఎనిమిదేళ్లుగా మాట్లాడలేని బాలుడికి… 8 వారాల్లో మాటలు నేర్పిన ఆర్మీ డాక్టర్!

Indian Army humanitarian aid : ఎనిమిదేళ్లుగా ఆ ఇంట్లో వినిపించని మాటల మువ్వలు… ఇప్పుడు సవ్వడి చేస్తున్నాయి. కన్న కొడుకు గొంతు వినలేమంటూ కన్నీరుమున్నీరైన ఆ తల్లిదండ్రుల కళ్లల్లో ఇప్పుడు ఆనందభాష్పాలు పొంగుతున్నాయి. పుట్టుకతో వచ్చిన సమస్యతో మూగబోయిన ఓ చిన్నారి జీవితంలో భారత సైన్యం వెలుగులు నింపింది. ఓ ఆర్మీ వైద్యుడి అకుంఠిత దీక్ష, మానవతా దృక్పథం ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. అసలు ఎవరా బాలుడు..? ఆ ఆర్మీ వైద్యుడు చేసిన మాయేంటి..? ఎనిమిదేళ్ల నిశ్శబ్దానికి ఎలా తెరపడిందో తెలుసుకుందాం.

ఆశలు వదులుకున్న వేళ : జమ్ముకశ్మీర్‌లోని మారుమూల కథువా జిల్లా, బథోడీ దుగ్గన్ గ్రామం. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు ఎనిమిదేళ్ల అక్షయ్ శర్మ. అతని తల్లిదండ్రులు భారత సైన్యంలో సివిల్ కూలీలుగా పనిచేసే నిరుపేదలు. అక్షయ్‌కు పుట్టుకతోనే ‘చీలిన పెదవి, అంగిలి’ (Cleft Lip and Palate) అనే సమస్య ఉంది. దీంతో అతనికి మాటలు సరిగా రాలేదు. మూడేళ్ల వయసులో తల్లిదండ్రులు తమ శక్తికి మించి అప్పుచేసి శస్త్రచికిత్స చేయించినా, ఫలితం శూన్యం. కొడుకు నోటివెంట మాట వినాలన్న వారి ఆశ అడియాసగానే మిగిలిపోయింది. మళ్లీ సర్జరీ చేయించే స్థోమత లేక, విధికి తలొంచి ఆశలు వదులుకున్నారు.

- Advertisement -

సైనికుడి రూపంలో దేవుడు : రెండు నెలల క్రితం అక్షయ్ దీనగాథ, ఓ ఆర్మీ అధికారి ద్వారా వైద్యుడు సౌరభ్ సలూంఖే వద్దకు చేరింది. ఆ చిన్నారి పరిస్థితికి చలించిపోయిన డాక్టర్ సౌరభ్, స్వయంగా వారి గ్రామానికి వెళ్లి అక్షయ్‌ను, అతని తల్లిదండ్రులను కలిశారు. “మీ బిడ్డకు మాటలు నేర్పించే బాధ్యత నాది” అని భరోసా ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతిరోజూ మూడు గంటల సమయాన్ని కేవలం అక్షయ్ కోసమే కేటాయించడం మొదలుపెట్టారు.

8 వారాల అకుంఠిత దీక్ష : అక్షయ్‌కు మాటలు నేర్పించడం అంత సులభం కాదు. పదాలను స్పష్టంగా పలకలేని స్థితిలో ఉన్నాడు. డాక్టర్ సౌరభ్ ఓపికతో, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ప్రారంభించారు..

ధ్వనిశాస్త్రంపై అవగాహన : పిల్లలకి అర్థమయ్యేలా, మన శరీరాన్ని ఉపయోగించి శబ్దాలు ఎలా వస్తాయో చెప్పారు. ముక్కుతో ‘అమ్మ, నాన్న’ లాంటి శబ్దాలు ఎలా వస్తాయో, గొంతుతో ‘క’, ‘ఖ’ లాంటివి ఎలా వస్తాయో, నోరు తెరిచి ‘ఆ, ఈ’ లాంటి శబ్దాలు, పెదాలు కలిపి ‘ప, బ, మ’ లాంటివి, అంగిలికి నాలుక తగిలి ‘చ, జ’ లాంటి శబ్దాలు ఎలా వస్తాయో ఆడుతూ పాడుతూ వివరించారు.

శారీరక వ్యాయామాలు: నోటిలోని వివిధ భాగాల్లోకి నీటిని తీసుకుని పుక్కిలించడం, నాలుక, దవడ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయించారు.

భాషా శిక్షణ: హిందీ, ఇంగ్లీష్ భాషల్లోని ప్రాథమిక వాక్యాలను ఎలా పలకాలో నేర్పించారు. ఈ కఠోర శ్రమ ఎనిమిది వారాల పాటు, ప్రతిరోజూ మూడు గంటల చొప్పున నిరాటంకంగా సాగింది.

ఫలించిన కృషి.. పొంగిన ఆనందం : డాక్టర్ సౌరభ్ దీక్ష ఫలించింది. ఎనిమిదేళ్ల నిశ్శబ్దానికి తెరపడింది. అక్షయ్ శర్మ నోటివెంట స్పష్టమైన మాటలు జాలువారాయి. ‘మఛిలీ జల్ కీ రాణీ హై’ అంటూ హిందీ గీతాన్ని చక్కగా ఆలపించాడు. ఆ దృశ్యం చూసిన తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చేతులు జోడించి, కన్నీళ్లతో ఆ వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్ఫూర్తిదాయక వీడియోను భారత ఆర్మీ జమ్ము విభాగం ‘నిశ్శబ్ద స్వప్నాలు, ఇప్పుడు మాట్లాడుతాయి’ అనే క్యాప్షన్‌తో ‘ఎక్స్’లో పంచుకోగా, అది వైరల్‌గా మారింది.

స్పందనలు…
“నా కొడుకును ఆర్మీ అధికారిని చేస్తా” – అక్షయ్ తల్లి: “నా కొడుకు మాట్లాడుతుంటే నా ఆనందానికి హద్దుల్లేవు. డాక్టర్ సౌరభ్ సలూంఖే మా పాలిట దేవుడిలా వచ్చారు. ఆయన రుణం తీర్చుకోలేనిది. నా కొడుకును కూడా పెంచి పెద్దచేసి ఆర్మీ అధికారిని చేస్తాను.”
“గొప్ప అవకాశం లభించింది”

డాక్టర్ సౌరభ్ సలూంఖే: “ఎనిమిది వారాల శిక్షణ తర్వాత అక్షయ్ చక్కగా మాట్లాడుతున్నాడు. ఇంకా కొంచెం శిక్షణ మిగిలి ఉంది. ఆ కుటుంబం కళ్లల్లో ఆనందం చూడటం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఓ బాలుడి జీవితాన్ని మార్చే అవకాశం రావడం నా అదృష్టం.”

“మానవతా ప్రయత్నాల్లో భాగమే” – డిఫెన్స్ పీఆర్‌ఓ:ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి ఆర్మీ ఎప్పుడూ ముందుంటుంది. డాక్టర్ సౌరభ్ చొరవ అలాంటి మానవతా ప్రయత్నాల్లో భాగమే.”


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad