ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆస్తులు గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. వచ్చే నెల జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. బుధవారం ఈ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం రూ.40 వేలు నగదు, రూ.3.46 లక్షల విలువైన చరాస్తులు, రూ.1.7 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి రూ.1.73 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఇక ఆయన భార్య సునీతకు రూ.32 వేల నగదు, రూ.కోటి విలువైన చరాస్తులు, రూ.1.5 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో 13 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అవి విచారణ దశలో ఉన్నాయని చెప్పారు.
కాగా 2020 ఎన్నికల నాటి అఫిడవిట్లో తనకు రూ.9.95 లక్షలు, భార్య సునీత పేరు మీద రూ.57 లక్షల విలువైన చరాస్తులు.. తన పేరు మీద రూ.1.77 కోట్లు, భార్య పేరు మీద రూ.కోటి విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. రెండు సార్లు సీఎంగా పనిచేసిన ఆయనకు సొంత ఇల్లు, సొంత కారు లేకపోవడం గమనార్హం.