ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తాజాగా హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చెన్నైలో జరిగిన ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ స్నాతకోత్సవానికి అశ్విన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో ముచ్చటిస్తూ ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషలు ఎంతమందికి అర్థమవుతాయని అడిగారు. ఈ క్రమంలో హిందీ భాష మీకు అర్థమవుతుందా అని ప్రశ్నించగా.. కొంతమంది మాత్రమే అర్థమవుతుందని సమాధానం ఇచ్చారు.
దీనిపై అశ్విన్ స్పందిస్తూ హిందీ అధికారిక భాష మాత్రమే.. జాతీయ భాష కాదన్నారు. దీంతో అశ్విన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కొంతకాలంగా హిందీ భాషపై తమిళనాడులో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దుతున్నారని అక్కడి రాజకీయ నేతలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హిందీ జాతీయ భాష కాదంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.