Land Scam: అస్సాంలో ఒక సివిల్ సర్వీస్ అధికారిణి అవినీతి కేసులో అరెస్టు కావడం సంచలనం సృష్టిస్తోంది. భూ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్షరాలా రూ.90 లక్షల నగదు మరియు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు లభ్యం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
లంచంగా భూమి తీసుకున్న అధికారిణి
గువాహటిలో సీఎం ప్రత్యేక విజిలెన్స్ సెల్‌లో పనిచేస్తున్న నుపుర్ బోరాపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ స్వయంగా ఆరోపణలు చేశారు. బార్పేట్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేసినప్పుడు ఆమె డబ్బుకు బదులుగా భూమిని లంచంగా తీసుకున్నట్లు నిఘాలో తేలిందన్నారు. గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచామని, ఈ దర్యాప్తులో భాగంగానే సోమవారం ఆమె ఇంటితో పాటు మరో మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు సీఎం తెలిపారు. సోదాల్లో లభించిన డబ్బు, బంగారు ఆభరణాలతో పాటు నుపుర్ బోరా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Chandrababu : వారికి శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
దర్యాప్తు కొనసాగుతోంది
విజిలెన్స్ ఎస్పీ రోజీ కలిత మాట్లాడుతూ, ఈ కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, నుపుర్‌పై మరిన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దర్యాప్తులో అవి బయటపడతాయని వెల్లడించారు. ఈ కేసులో నుపుర్‌కు సహాయకుడిగా ఉన్న లాట్ మండల్ సురాజిత్ డేకా నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. అతడిపై కూడా భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బయటపడటం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన ప్రభుత్వ అధికారుల మధ్య ఉన్న అవినీతిని మరోసారి ఎత్తిచూపుతోంది.


