ASSAM MAN MILK BATH AFTER DIVORCE: విడాకులంటే బాధ, వియోగం… కానీ ఓ వ్యక్తి మాత్రం వాటిని ఓ కొత్త ఆరంభంగా, స్వేచ్ఛకు ప్రతీకగా భావించాడు. భార్య నుంచి చట్టబద్ధంగా విడాకులు మంజూరైన ఆనందంలో ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేసి తన సంతోషాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తాను ఇకనుంచి స్వేచ్ఛగా ఉంటానని, భారం దిగిపోయిందని ఆనందంతో అరిచి చెప్పిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వ్యక్తి ఎవరు? ఎందుకు విడాకుల కోసం ఇంతలా సంబరపడ్డాడు? అతని పాల స్నానం వెనుక ఉన్న కథాకమామీషు ఏమిటి..?
విముక్తికి ప్రతీకగా పాల స్నానం: మాణిక్ అలీ కథనం:
అసోంలోని నల్బరి జిల్లా, ముకల్మువా పోలీస్ స్టేషన్ పరిధిలోని బరలియాపర్ గ్రామానికి చెందిన మాణిక్ అలీ జీవితంలో నెలకొన్న ఓ అసాధారణ ఘట్టం ఇది. తన భార్య నుంచి చట్టబద్ధంగా విడాకులు మంజూరు కావడంతో తనకు ‘విముక్తి’ లభించిందని భావించాడు. ఈ స్వేచ్ఛను అభినందనపూర్వకంగా స్వీకరిస్తూ, 40 లీటర్ల స్వచ్ఛమైన పాలతో స్నానం చేసి తన ఆనందాన్ని పదిలంగా చాటుకున్నాడు. ఈ అరుదైన దృశ్యం అసోంతో పాటు యావత్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది.
“ప్రియుడితో పలాయనం”: భార్య తీరుపై మాణిక్ అలీ ఆవేదన:
తన పాల స్నానం వెనుక ఉన్న కారణాలను మాణిక్ అలీ స్వయంగా వెల్లడించాడు. అతని కథనం ప్రకారం, తన భార్య ఆమె ప్రియుడితో రెండుసార్లు పారిపోయిందని, కుటుంబ జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చిందని తెలిపాడు. తన ఏకైక కూతురి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రెండు సార్లు తన భార్యను క్షమించి, తిరిగి కుటుంబంలోకి చేర్చుకున్నానని వివరించాడు. అయితే, తన భార్య తన తప్పును పదేపదే పునరావృతం చేస్తూ, ప్రియుడితో పారిపోవడం అలవాటుగా మార్చుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితిని తాను ఇక భరించలేక, తన భార్య నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడమే శరణ్యమని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.
కెమెరా కళ్ల ముందు “క్షీరాభిషేకం”
భార్యతో విడాకుల ప్రక్రియ చట్టబద్ధంగా పూర్తయిన తర్వాత, మాణిక్ అలీ ఈ సందర్భాన్ని చిరస్మరణీయంగా మార్చుకోవాలని సంకల్పించాడు. కెమెరాల ముందు నాలుగు బకెట్ల (సుమారు 40 లీటర్లు) పాలతో స్నానం చేస్తూ, తన ఆనందాన్ని నలుదిశలా చాటాడు. పాల స్నానం చేస్తున్న సమయంలో, “ఈరోజు నుంచి నేను స్వేచ్ఛగా ఉన్నాను. నా భారం దిగిపోయింది. ఇప్పుడు నేను అన్నింటినీ విడిచిపెట్టేశాను” అని బిగ్గరగా అరుస్తూ తన నూతన స్వేచ్ఛను ప్రకటించాడు.
“నా బిడ్డ కోసం వివాహ బంధాన్ని కొనసాగించడానికి నేను నిజాయితీగా ప్రయత్నించాను. కానీ నా భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అనేక సందర్భాల్లో కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రియుడితో పరారైంది. పలుమార్లు నేను రాజీపడ్డాను. ఆఖరికి మా వివాహ బంధం విచ్ఛిన్నమయ్యే దశకు చేరుకుంది. చివరికి విడాకులు తీసుకున్నాను. నా భార్య తన ప్రియుడితో వెళ్లేప్పుడు నా కూతురిని తీసుకెళ్లింది. అదే నన్ను బాధపెట్టింది. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత నేను కొత్త జన్మ ఎత్తినట్లు అనిపించింది. అందుకే కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా నేను పాలతో స్నానం చేశాను,” అని మాణిక్ అలీ తన ఆవేదన, ఆనందాలను పంచుకున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్: నెటిజన్ల భిన్న అభిప్రాయాలు:
మాణిక్ అలీ భార్యతో విడాకుల తర్వాత పాలతో స్నానం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని అందరి దృష్టిని ఆకర్షించే ఒక ‘స్టంట్’ గా అభివర్తిస్తుండగా, మరికొందరు దీనిని ఒక భావోద్వేగ ముగింపు కోసం చేసిన ఒక వినూత్న వేడుకగా భావిస్తున్నారు. ఏది ఏమైనా, మాణిక్ అలీ చర్య ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.


