Students Fall Sick After Drinking Contaminated Water: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. కలుషితమైన నీరు తాగి సుమారు 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చిమూర్ తాలూకాలోని జామ్భుల్‌ఘాట్‌లో ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
పాఠశాలలోని విద్యార్థులు నీరు తాగిన తర్వాత వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో బాధపడ్డారని ఒక అధికారి తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చిమూర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన ఇద్దరికి ఇంకా చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించారు. పాఠశాలను సందర్శించి, నీటి వనరులను పరిశీలించారు. కలుషితమైన నీటి సరఫరా కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, పంచాయతీ సమితిని వెంటనే ఆ పాఠశాల నీటి వనరులను మార్చాలని అధికారులు ఆదేశించారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, తాగునీటి శుభ్రత విషయంలో ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాలనే డిమాండ్లు ఈ ఘటనతో మరోసారి తెరపైకి వచ్చాయి. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


