Navneet Rana| మాజీ ఎంపీ, బీజేపీ మహిళా నేత నవనీత్ రాణాపై దాడి జరిగింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్యాపూర్ అసెంబ్లీ నియోజక వర్గంలోని ఖల్లార్ గ్రామంలో యవ స్వాభిమాన్ పార్టీ అభ్యర్థి రమేష్ బండిలేకు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. సభ జరుగుతుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభం కాగా.. కొద్దిసేపటికే ఓ వర్గం ప్రజలు నవనీత్ వైపుగా కుర్చీలు విసిరారు. దీంతో అక్కడ తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ దాడి నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
శాంతియుతంగా ప్రచారం చేస్తున్న తమపై కొందరు దుండగులు దాడి చేశారని నవనీత్ మండిపడ్డారు. దాడి సమయంలో అల్లా హు అక్బర్ నినాదాలు చేయడంతో పాటు తనను అసభ్యకరంగా దూషించారని ఆమె ఆరోపించారు. కాగా గత నెలలోనూ నవీనత్ రాణాకు రూ.10 కోట్లు ఇవ్వాలని దుండగుల నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెపై మరోసారి దాడి జరగడం చర్చనీయాంశమైంది.