Aurangabad Railway Station Renamed As Chhatrapati Sambhajinagar Station: మహారాష్ట్రలోని చారిత్రక ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు మీద ఉన్న ఔరంగాబాద్ నగరం పేరును మూడేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఛత్రపతి శంభాజీనగర్ గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఔరంగాబాద్ పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ పేరును కూడా ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్‌గా మారుస్తూ మహాయుతి (బీజేపీ – షిండే శివసేన – అజిత్ పవార్ ఎన్సీపీ) ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన గెజిట్ జారీ చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు, మరాఠా రాజ్యానికి రెండవ పాలకుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ పేరు మీద ఔరంగాబాద్ నగరానికి పేరు మార్చగా.. మూడేళ్ల తర్వాత ఈ స్టేషన్ పేరు మార్చారు. అలాగే కొత్త స్టేషన్ కోడ్ ‘CPSN’గా పేర్కొన్నట్లు సెంట్రల్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఇందులో భాగంగానే దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్‌కు చెందిన ‘ఔరంగాబాద్’ రైల్వే స్టేషన్ పేరును ‘ఛత్రపతి శంభాజీనగర్’ రైల్వే స్టేషన్‌గా మారుస్తూ.. రైల్వే కోడ్ ‘CPSN’తో మార్చడానికి అధికారికంగా ఆమోదముద్ర వేశారు. దీంతో ‘ఔరంగాబాద్’ రైల్వే స్టేషన్‌ను ఇకపై ‘ఛత్రపతి శంభాజీనగర్’ రైల్వే స్టేషన్‌గా పిలవనున్నట్లు, స్టేషన్ కోడ్ CPSN గా పిలవనున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
పర్యాటక ప్రదేశాలకు కేరాఫ్ ఔరంగాబాద్..
అయితే, హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో 1900లో ప్రారంభించిన ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని నాందేడ్ డివిజన్ పరిధిలో.. కాచిగూడ–మన్మాడ్ సెక్షన్‌లో ఉంది. దేశంలోని అనేక ప్రధాన నగరాలకు ఈ రైల్వే స్టేషన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడి నుంచి ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉంది. ప్రస్తుతం, ఛత్రపతి శంభాజీనగర్‌గా పిలవబడుతున్న ఈ నగరం మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక, సాంస్కృతిక కేంద్రాలలో ఒకటిగా పేరొందింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించిన అజంతా, ఎల్లోరా గుహలకు ఈ నగరం కేరాఫ్ అడ్రస్. మొఘల్ యుగం నాటి చారిత్రక బీబీ-కా-మక్బరా, అనేక చారిత్రక ద్వారాలు ఈ ఛత్రపతి శంభాజీనగర్ నగరంలో ఉన్నాయి. గతంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాఢీ (ఎంవీఏ) ప్రభుత్వం ఈ పేరు మార్చే ప్రక్రియను ప్రారంభించింది. అయినప్పటికీ.. మహాయుతి ప్రభుత్వం తాజాగా దీన్ని అధికారికంగా పూర్తి చేసింది. ప్రయాణికులు ఇకపై ఈ స్టేషన్‌ను ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌గానే గుర్తించాలని రైల్వే అధికారులు సూచించారు.


