Honest Auto Driver in Kerala : పది రూపాయలు కనిపించినా పాకెట్‌లో వేసుకునే రోజులివి. ఇలాంటి రోజుల్లోనూ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు ఓ ఆటో డ్రైవర్. పెళ్లికి కావాల్సిన బంగారాన్ని కోల్పోయి నిరాశలో కూరుకపోయిన కుటుంబంలో చిరునవ్వులు పూయించాడు. కొల్లంకు చెందిన ఆటో డ్రైవర్ ప్రసన్నకుమార్.. ఇంతకీ ఏం జరిగింది..?
కేరళ రాష్ట్రం కంజిరాంచిరకు చెందిన కరక్కట్ జేమ్స్ ఇంట్లో ఈ హృదయపూర్వక సంఘటన చోటుచేసుకుంది. సోమవారం జేమ్స్ కుమారుడైన ఆల్బర్ట్ వివాహం జరగాల్సి ఉంది. ఈ శుభకార్యానికి అవసరమైన బంగారాన్ని తీసుకొని, వారి బంధువులైన అనీష్, నయన అనే ఇద్దరు అలప్పుజలోని జేమ్స్ ఇంటికి బయలుదేరారు.
ఆటో ప్రయాణం – అదృశ్యమైన బంగారం : కొల్లం నుంచి అలప్పుజ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వీరు, అక్కడి నుంచి జేమ్స్ ఇంటికి వెళ్లేందుకు ప్రసన్నకుమార్ అనే ఆటో డ్రైవర్ ఆటో ఎక్కారు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఆటో దిగి ఇంట్లోకి వెళ్లారు. ప్రసన్నకుమార్ కూడా తన ప్రయాణం ముగించుకొని వెళ్లిపోయాడు.
ఇంట్లోకి వెళ్లిన కాసేపటికి అనీష్, నయన తాము తీసుకొచ్చిన బంగారం బ్యాగును వెతికారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో, ఆటోలోనే మరిచిపోయినట్టు గుర్తుతెచ్చుకున్నారు. దీంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు, సీసీ ఫుటేజ్ సహాయంతో ఆటోను కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెళ్లికి ముందు ఇలాంటి సంఘటన జరగడంతో వధూవరుల కుటుంబాలు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి.
నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ : అయితే, మరోవైపు తన ప్రయాణం ముగించుకుని దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి చేరుకున్న ప్రసన్నకుమార్.. ఆటోను పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఆటో వెనుక సీట్‌లో ఒక బ్యాగును గుర్తించాడు. దాన్ని తీసి చూడగా అందులో 18 తులాల బంగారు ఆభరణాలు ఉండడాన్ని గమనించాడు. నష్టం వల్ల కలిగే బాధను గ్రహించిన ప్రసన్నకుమార్, క్షణం కూడా ఆలోచించకుండా, ఆ బ్యాగును తిరిగి అప్పగించాలనే తక్షణ నిర్ణయంతో వారిని దించిన ఇంటికి చేరుకున్నాడు.
కళ్ళలో ఆనందం నింపిన ప్రసన్నకుమార్ : పెళ్లి ఇంటికి చేరుకొని, నిరాశలో మునిగి ఉన్న ఆ కుటుంబానికి బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును అందించాడు. దీంతో ఒక్కసారిగా పెళ్లింటి వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆగిపోతుందనుకున్న పెళ్లిని నిలబెట్టినందుకు వారంతా ప్రసన్నకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అతని నిజాయితీకి, మానవత్వానికి ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన ప్రసన్నకుమార్ నిజాయితీని చాటి చెప్పడమే కాకుండా, సమాజంలో మానవత్వం ఇంకా సజీవంగా ఉందని నిరూపించింది.


