Ayodhya Ram Mandir darshan timings : అయోధ్యలో కొలువైన బాలరాముడిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో కీలక అప్‌డేట్. శీతాకాలం ప్రారంభం కావడంతో, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, ఆలయ దర్శన సమయాలలో మార్పులు చేసింది. భక్తుల సౌకర్యార్థం చేసిన ఈ మార్పులు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. అసలు కొత్త సమయాలు ఏంటి? పాత సమయాలకు, కొత్త సమయాలకు మధ్య ఉన్న వ్యత్యాసమేంటి?
శీతాకాలంలో పగటి సమయం తక్కువగా ఉండటం, చలి తీవ్రత పెరగడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని, ఆలయ ట్రస్ట్ దర్శన వేళలను సవరించింది. మొత్తం దర్శన సమయ వ్యవధిని ఒక గంట పాటు తగ్గించింది.
కొత్త దర్శన వేళలు ఇవే : గురువారం నుంచి అమల్లోకి వచ్చిన నూతన సమయాలు ఇలా ఉన్నాయి:
ఉదయం: భక్తులను ఉదయం 7:00 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. (గతంలో ఇది 6:30 గంటలకు ఉండేది).
మధ్యాహ్నం: 12:00 గంటలకు భోగ హారతి అనంతరం, 12:30 నుంచి 1:00 గంట వరకు అరగంట పాటు ఆలయ తలుపులు మూసివేస్తారు.
సాయంత్రం: మధ్యాహ్నం 1:00 గంటకు తిరిగి ప్రారంభమయ్యే దర్శనం, రాత్రి 9:30 గంటల వరకు కొనసాగుతుంది.
ముఖ్య గమనిక: బిర్లా ధర్మశాల ముందున్న గేటును ఉదయం 8:30 గంటలకే మూసివేస్తారు. ఉదయం 9 గంటల తర్వాత సెక్యూరిటీ గేట్ డీ1 నుంచి భక్తులకు అనుమతి ఉండదని ట్రస్ట్ స్పష్టం చేసింది.
పూర్తవుతున్న ఆలయ నిర్మాణం.. నవంబర్ 25న వేడుకలు
మరోవైపు, అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా, నవంబర్ 25న ఆలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆలయ ట్రస్ట్ ఆహ్వానం పంపింది. ఆలయ నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో, త్వరలోనే భక్తులు ఆలయ సముదాయాన్ని పూర్తిగా సందర్శించేందుకు అధికారులు అవకాశం కల్పించనున్నారు. రామాయణ గాథలను ప్రతిబింబించేలా, 140కి పైగా అద్భుతమైన స్తంభాలతో, 70 శాతం పచ్చదనంతో ఆలయ సముదాయం రూపుదిద్దుకుంటోంది. ఈ ఆలయ రూపకల్పన, రాబోయే తరాలకు గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని మిగిల్చనుంది.


