Banke Bihari Temple Treasury Reopened: ఒడిశా పూరీ జగన్నాథుడి ఆలయ ఖజానా తెరుచుకున్న తర్వాత.. దేశవ్యాప్తంగా మరో ఆలయ ఖజానా విశేషాల కోసం ఆసక్తి నెలకొంది. అదే కృష్ణయ్య మందిరం. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో బృందావన్‌లో కొలువైన బాంకే బిహారీ ఆలయం. 54 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ ఆలయ ఖజానా తలుపులు ఈ రోజు అత్యంత పటిష్ఠ భద్రత నడుమ తెరుచుకున్నాయి. ధన త్రయోదశి సందర్భంగా వాసుదేవుని ఆలయంలో ఖజానాను అధికారులు పరిశీలిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/rajnath-singh-warns-pakistan-brahmos-missile-range/
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, పటిష్ఠమైన భద్రతా పర్యవేక్షణల నడుమ ఆలయ ఖజానా తెరుచుకుంది. ఖజానా గదిలోకి కోర్టు అనుమతి పొందిన కమిటీ సభ్యులకు మాత్రమే అనుమతి ఉంది. 54 ఏళ్లుగా గది తలుపులు మూసి ఉండటంతో ముందు జాగ్రత్త చర్యల కోసం అగ్నిమాపక, అటవీ శాఖ బృందాలతో పాటు ప్రత్యేక అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంచారు. మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేస్తున్నారు.
బాంకే బిహారీ ఆలయంలో నిధి గదిలోకి ప్రవేశించే ముందు, అధికారులు ప్రవేశ ద్వారం వద్ద సాంప్రదాయ ఆచారాలతో దీపారాధన నిర్వహించారు. సివిల్ జడ్జి, సిటీ మేజిస్ట్రేట్, ఎస్పీ సిటీ, CO బృందావన్, CO సదర్, నలుగురు గోస్వామిలతో కూడిన పరిశోధన బృందం సేఫ్టీ మాస్కులు ధరించి గదిలోకి ప్రవేశించినట్లు ఆలయ సంరక్షకుడు ఘనశ్యామ్ గోస్వామి వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/national-news/jairam-ramesh-jibe-pm-modi-mauni-baba-trump-remarks/
కాగా, మొదటగా ప్రాథమిక శోధనలో ఖజానా గది లోపల ఒక పెట్టె, కలశంను బృందం కనుగొంది. ఆ నిధిలో బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాల ఆభరణాలు, ఇతర విలువైన కళాఖండాలు ఉంటాయని సమాచారం. కాగా, గర్భగుడిలో స్వామివారి సింహాసనం కింద ఉన్న బాంకే బిహారీ ఆలయ ఖజానాను చివరిసారిగా 1971లో అప్పటి మందిర్ కమిటీ అధ్యక్షుడి పర్యవేక్షణలో తెరిచారు. ఆ తర్వాత 2002లో ఒకసారి, 2004లో రెండోసారి ఖజానా తలుపులు తెరవడానికి యత్నించినా.. అధికారిక అనుమతులు లేకపోవడంతో ఆపేశారు. మళ్లీ ఇప్పుడు 54 ఏళ్ల తర్వాత ఆ గది తలుపులు తెరుచుకున్నాయి.
ఖజానా గదిలో దాదాపు 160 సంవత్సరాల నాటి బంగారం, వెండి ఆభరణాలు, బంగారు కలశాలు, వెండి నాణేలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రత్యేక కమిటీ ఇన్వెంటరీని తనిఖీ చేసి, ఆభరణాలతో పాటు ఇతర కళాఖండాలను డాక్యుమెంట్ చేయనుంది. చారిత్రక కథనం ప్రకారం ఈ ఖజానాను వైష్ణవ సంప్రదాయాల ప్రకారం 1864లో నిర్మించారని తెలుస్తోంది. ఈ ఖజానాలో భరత్‌పూర్, కరౌలి, గ్వాలియర్ రాజ్యాల నుంచి వచ్చిన విరాళాలను కలిగి ఉంది. ఈ ఖజానాలో సీలు వేసిన పత్రాలు, బహుమతులు, ప్రశంసా పత్రాలు, దానం చేసిన భవనాలతో పాటు పొలాల భూమి పత్రాలు కూడా ఉన్నాయి. 1862 లో బృందావనంలో శ్రీ బాంకే బిహారీ ఆలయాన్ని నిర్మించారు. బాంకే బిహారీ అంటే “మూడు చోట్ల వంగి” అని అర్థం. శ్రీకృష్ణుని విగ్రహం త్రిభంగ భంగిమలో ఉంటుంది.


