Bankipur Bypoll Result Nitin Nabin Introspection : మూడు రాష్ట్రాల శాసనసభ ఉపఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. మూడు దశాబ్దాలుగా చెక్కుచెదరని తిరుగులేని కంచుకోట అనూహ్యంగా కూలిపోవడం, గెలిచిన చోట కూడా ఆధిక్యం కరిగిపోవడం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది.
బిహార్‌లోని బాంకీపుర్ నియోజకవర్గం 1995 నుంచి బీజేపీకి తిరుగులేని అడ్డాగా నిలిచింది. నితిన్ నబీన్ తండ్రి నవీన్ చంద్ర సిన్హా నుంచి మొదలై, నితిన్ నబీన్ వరుసగా ఐదుసార్లు ఇక్కడి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆయన రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.
ఈ ఉపఎన్నికలో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బరిలోకి దిగి 19,324 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి రాజకీయ చదరంగంలో సంచలనం సృష్టించారు. ప్రశాంత్ కిశోర్‌కు 64,151 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌కు 44,827 ఓట్లు మాత్రమే దక్కాయి. ఆర్‌జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన జనసురాజ్ పార్టీ, ఈసారి ఏకంగా బీజేపీ మాతృభూమిలోనే దెబ్బకొట్టడం విశేషం
దాతియాలో కాంగ్రెస్ ఆధిపత్యం: చేజారని పట్టు : మధ్యప్రదేశ్‌లోని దాతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ తన పట్టును నిలుపుకుంది.రాజేంద్ర భారతి అనర్హత వేటుతో ఖాళీ అయిన ఈ స్థానంలో జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీపై 6 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్‌ను ఓడించి ఆక్రమించాలని భావించిన బీజేపీకి మళ్లీ నిరాశే ఎదురైంది.
మంజల్పూర్‌లో గెలుపు ఓకే.. కానీ కరిగిన మెజారిటీ : గుజరాత్‌లోని వడోదర జిల్లా మంజల్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యోగేశ్‌భాయ్ పటేల్ మృతితో ఇక్కడ ఎన్నిక నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి సతీశ్ పటేల్ తమ సమీప కాంగ్రెస్ అభ్యర్థి భిఖాభాయ్ రబారీపై 30,630 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఓదార్పునిచ్చారు. కానీ, 2022 సాధారణ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి లభించిన లక్షకు పైగా మెజారిటీతో పోలిస్తే ఈసారి ఆధిక్యం గణనీయంగా తగ్గడం బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఓటమిపై నితిన్ నబీన్ స్పందన: ఉపఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని పేర్కొన్న ఆయన, మంజల్పూర్ ప్రజలు కమలం పార్టీపై ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలిపారు.
అదే సమయంలో బాంకీపుర్, దాతియా ఫలితాలు తమ అంచనాలకు భిన్నంగా వచ్చాయని అంగీకరించారు. ఈ రెండు చోట్ల ఎదురైన పరాజయంపై లోతైన ఆత్మపరిశీలన, సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. లోపాలను సరిదిద్దుకుని, కొత్త ఉత్సాహంతో ప్రజల వద్దకు వెళ్లి విశ్వాసాన్ని పునరుద్ధరించుకుంటామని స్పష్టం చేశారు.

