Lawyer membership cancel in Bar Association: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పైకి చెప్పు విసిరేందుకు యత్నించిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ అనూహ్య ఘటన భారత న్యాయవ్యవస్థలో పెద్ద కలకలం సృష్టించింది. దాడికి యత్నించిన న్యాయదాది తీరును యావత్ దేశం ముక్తకంఠంతో వ్యతిరేకించింది. అయితే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. అంతేకాదు తాజాగా న్యాయవాది రాకేశ్ కిషోర్ సభ్యత్వాన్ని సైతం వెంటనే రద్దు చేస్తున్నట్లుగా ప్రకటనను జారీ చేసింది. దీంతోపాటు న్యాయస్థానం ప్రాంగణంలోకి కూడా ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును బార్ కౌన్సిల్ రద్దు చేసింది. తాజా ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటనలో వెల్లడించింది.
పవిత్రమైన కోర్టుపై ప్రత్యక్ష దాడి: ఇలాంటి అస్థిరమైన ప్రవర్తన కోర్టు అధికారికి పూర్తిగా తగదని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పేర్కొంది. న్యాయవాది తీరు వృత్తిపరమైన నీతికి మాయని మచ్చలా మిగిలపోతుందని తెలిపింది. ఆతని తీరు భారత సర్వోన్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు గౌరవాన్ని కూడా.. కాలరాయడమేనని ప్రకటనలో వెల్లడించింది. న్యాయవాది రాకేశ్ కిశోర్ చేసిన దాడి స్వతంత్ర న్యాయవ్యవస్థపై.. పవిత్రమైన కోర్టు గది కార్యకలాపాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా బార్ అసోసియేషన్ అభివర్ణించింది.
Also read:https://teluguprabha.net/national-news/lawyer-rakesh-kishore-comments-after-cji-attack/
ముక్తకంఠంతో ఖండించిన యావత్ దేశం: ఇటీవల ఓ కేసు విచారణ సమయంలో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై న్యాయవాది కిశోర్.. తన కాలి బూటుతో దాడికి యత్నించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఆ దాడిని అడ్డుకున్నారు. ఆ లాయర్‌ని కోర్టు హాల్ నుంచి బయటకు తరలించారు. ఈ క్రమంలో ఆయన సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదంటూ నినాదాలు చేయడం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవని అన్నారు. ఈ ఘటనను ప్రధాని మోదీతో సహా పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు, న్యాయవాదుల సంఘాల నాయకులతో పాటుగా యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించింది.


