Belgian Court Approved Mehul Choksi Extradition: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పలాయనవాది అయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించడానికి (Extradition) బెల్జియం కోర్టు శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అంట్‌వెర్ప్‌లోని కోర్టు తీర్పు ఇచ్చింది. భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు బెల్జియం పోలీసులు ఏప్రిల్ 11న చోక్సీని అరెస్టు చేయడం సరియైనదే అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
మెహుల్ చోక్సీ ఈ ఉత్తర్వుపై రాబోయే 15 రోజుల్లో బెల్జియం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునే హక్కు కలిగి ఉన్నప్పటికీ, అతనిని భారత్‌కు తిరిగి తీసుకురావడానికి ఇది ఒక కీలకమైన తొలి అడుగుగా భావించవచ్చు.
ALSO READ: PM’s WARNING: “భారత్ ఇక ఆగదు.. ఉగ్రదాడులపై మౌనంగా ఉండదు, సర్జికల్ స్ట్రైక్స్‌తో బదులిస్తుంది!”
భారత వాదనలు, కోర్టు పరిశీలన
చోక్సీని అప్పగించాలనే కేసులో బెల్జియం ప్రాసిక్యూటర్లు భారత్ తరఫున, చోక్సీ లీగల్ టీమ్ తరఫున వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
- భారత్‌లో చోక్సీపై ఐపీసీ సెక్షన్లు 120బీ, 201, 409, 420, 477ఏ లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద మోసం, కుట్ర, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, అవినీతి వంటి నేరాలు నమోదయ్యాయి. ఈ నేరాలు బెల్జియం చట్టం కింద కూడా శిక్షార్హమైనవి కావడంతో (Dual Criminality), అప్పగింతకు మార్గం సుగమమైంది.
- జైలు హామీలు: చోక్సీ విదేశీ కోర్టుల్లో మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని లేవనెత్తకుండా ఉండేందుకు, భారత్ తరఫున సీబీఐ.. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోని బ్యారక్ నం. 12 లో అతన్ని ఉంచుతామని హామీ ఇచ్చింది. అక్కడ యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రమైన నీరు, ఆహారం, టీవీ, ప్రైవేట్ డాక్టర్ సౌకర్యం వంటివి కల్పిస్తామని, ఏకాంత నిర్బంధంలో ఉంచబోమని భారత అధికారులు స్పష్టం చేశారు.
- పౌరసత్వం వివాదం: తాను భారత పౌరసత్వాన్ని వదులుకుని ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నానని చోక్సీ వాదించినప్పటికీ, ఆయన ఇప్పటికీ భారత పౌరుడేనని భారత్ వాదించింది.
చోక్సీ పారిపోయే అవకాశం ఉందని కోర్టు గుర్తించడం, అతని అరెస్టు సమర్థనీయమని తీర్పు ఇవ్వడం భారత ప్రభుత్వానికి దక్కిన పెద్ద విజయంగా నిపుణులు భావిస్తున్నారు.


