Saturday, November 15, 2025
Homeనేషనల్Bangalore Flat Rents: బెంగుళూరులో అద్దెలు.. యూరప్ మించిన మోతలు!

Bangalore Flat Rents: బెంగుళూరులో అద్దెలు.. యూరప్ మించిన మోతలు!

Exorbitant flat rents in Bengaluru : భారత సిలికాన్ వ్యాలీ బెంగళూరులో బతకాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో! ఐటీ హబ్‌గా, స్టార్టప్‌ల స్వర్గధామంగా పేరొందిన ఈ నగరం, ఇప్పుడు ఆకాశాన్నంటుతున్న ఇంటి అద్దెలతో సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. ట్రాఫిక్‌తో నిత్యం నరకం చూపించే ఓ ప్రాంతంలో, ఒక సాధారణ ఫ్లాట్‌కు నెలకు ఏకంగా రూ.70,000 అద్దె, రూ.5 లక్షల డిపాజిట్ అడుగుతున్నారంటూ  ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్, ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. ఇంతకీ, యూరప్ ను మించిపోయిన ఈ అద్దెల వెనుక ఉన్న అసలు కథేంటి..? ఈ అద్దెల మోతకు కారణాలేంటి..?

- Advertisement -

ఒక్క పోస్ట్‌తో రచ్చ: ట్రాఫిక్‌కు, వర్షాకాలంలో వరదలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బెంగళూరులోని పణత్తూర్ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌కు యజమాని చెప్పిన అద్దె వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

అద్దె వివరాలు: నెలకు అద్దె రూ.70,000, సెక్యూరిటీ డిపాజిట్ రూ.5 లక్షలు.

నెటిజన్ ఆవేదన: ఈ పోస్ట్‌ను షేర్ చేసిన నెటిజన్, “నిజంగా, నెలకు 70 వేలు అద్దెనా? ఇది యూరప్ అపార్ట్‌మెంట్ల అద్దెల కన్నా ఎక్కువ. ఇది పూర్తిగా అసంబద్ధం,” అని తన ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు: ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

వ్యంగ్యాస్త్రాలు: “ఆఫీసుకు దగ్గరగా ఉందని అగ్గిపెట్టె సైజు ఇంటికి కూడా అంత అద్దె ఇస్తారు, కానీ తర్వాత రైల్వే అండర్‌పాస్ దగ్గర గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటారు,” అని ఒకరు చమత్కరించారు. “ఎప్పటికీ అడ్డంకిగా ఉండే ఆ ప్రాంతంలో ఫ్లాట్‌కు 70 వేలా? వావ్! యజమానికి దండం పెట్టాలి,” అని మరొకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

విమర్శలు: రూ.5 లక్షల డిపాజిట్ అడగడంపై చాలామంది తీవ్రంగా మండిపడ్డారు. “5 లక్షల డిపాజిట్ అడుగుతున్న ఆ మూర్ఖుడిని చూడండి. అలా అడగడంలో ఏమాత్రం అర్థం లేదు,” అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికుల వాదన: అయితే, కొందరు స్థానికులు మాత్రం, ఆ ప్రాంతంలో సాధారణంగా అద్దెలు నెలకు రూ.40,000 నుంచి రూ.45,000 మధ్యలోనే ఉంటాయని, ఈ ఒక్క యజమాని అడిగిన దానిని అందరికీ ఆపాదించకూడదని వాదిస్తున్నారు.

అద్దెలు ఎందుకు పెరుగుతున్నాయి : ఒకప్పుడు ముంబయి, ఢిల్లీలతో పోలిస్తే బెంగళూరులో అద్దెలు తక్కువగా ఉండేవని భావించేవారు. కానీ, కొవిడ్ తర్వాత పరిస్థితి తలకిందులైంది.

వర్క్ ఫ్రమ్ ఆఫీస్: ఐటీ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ ఆఫీస్’ విధానాన్ని పునఃప్రారంభించడంతో, ఉద్యోగులంతా నగరానికి తిరిగి వస్తున్నారు.

పెరిగిన డిమాండ్: టెక్ హబ్‌లకు సమీపంలో ఇళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
తగ్గిన నిర్మాణాలు: డిమాండ్‌కు తగినట్లుగా కొత్త ఇళ్ల నిర్మాణాలు లేకపోవడం కూడా అద్దెలు ఆకాశాన్నంటడానికి ఒక ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలతో, బెంగళూరులో సొంత ఇల్లు ఒక కలేమో, కనీసం అద్దె ఇల్లైనా దొరికితే చాలు దేవుడా అని వేడుకునే పరిస్థితి నెలకొంది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad