Bengaluru pet dog killed : నమ్మి ఇంటి బాధ్యతలు అప్పగిస్తే.. అభం శుభం తెలియని మూగజీవి ప్రాణాలు తీసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పెంపుడు కుక్కనే అత్యంత కిరాతకంగా హతమార్చింది. మంచి జీతం, ఉండటానికి వసతి కల్పించిన యజమానికే తీరని బాధని మిగిల్చింది. ప్రమాదంలో చనిపోయిందని చెప్పిన ఆమె అబద్ధాన్ని సీసీటీవీ కెమెరా బట్టబయలు చేసింది. ఇంతకీ ఆమె ఎందుకింతటి దారుణానికి ఒడిగట్టింది? అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే…
సీసీటీవీలో నిక్షిప్తమైన ఘోరం : బెంగళూరులో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుష్పలత (29) అనే మహిళ ఒక అపార్ట్‌మెంట్‌లో పనిమనిషిగా పనిచేస్తోంది. ఆమె యజమాని పెంపుడు జంతువులను చూసుకోవడమే ఆమె ప్రధాన విధి. ఇందుకుగానూ యజమాని ఆమెకు నెలకు రూ.23,000 జీతంతో పాటు, అదే అపార్ట్‌మెంట్‌లో ఉండటానికి వసతి కూడా కల్పించారు. అయితే, ఇటీవల యజమాని పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందింది. దీని గురించి యజమాని ప్రశ్నించగా, రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని పుష్పలత కట్టుకథ అల్లింది.
బట్టబయలైన అబద్ధం.. కటకటాల్లోకి నిందితురాలు : యజమానికి అనుమానం వచ్చి అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు నిజం బయటపడింది. ఆ ఫుటేజీలో, పుష్పలత అపార్ట్‌మెంట్ లిఫ్ట్ లోపల పెంపుడు కుక్కను అత్యంత క్రూరంగా నేలకేసి కొట్టి చంపిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ వీడియోను చూసి దిగ్భ్రాంతికి గురైన యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా చేసుకున్న బెంగళూరు పోలీసులు, నిందితురాలు పుష్పలతను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. నమ్మిన వారి ఇంట్లోనే ఉంటూ, మూగజీవి పట్ల ఇంతటి పైశాచికత్వానికి పాల్పడిన ఆమె చర్యపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


