Impotence Allegations : సాధారణంగా వైవాహిక జీవితంలో జరిగే చిన్న సమస్య.. బెంగళూరులో ఒక యువకుడి జీవితాన్ని చిక్కుల్లో పడేసింది. కొత్తగా పెళ్లయిన వరుడు పని ఒత్తిడి కారణంగా భార్యకు దూరంగా ఉండటంతో, అతడిపై నపుంసకత్వ ఆరోపణలు చేసి, ఏకంగా రెండు కోట్ల పరిహారం డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం చివరకు గృహ హింస, దాడి మరియు హత్యాయత్నం కేసుల వరకు వెళ్లింది.
మే నెలలో చిక్కమగళూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కేఎం, చందన అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారి వివాహం అనంతరం బెంగళూరులోని సప్తగిరి ప్యాలెస్‌లో నివాసం ఏర్పరుచుకున్నారు. అమ్మాయి ఇంట్లో జరిగిన మొదటి రాత్రి వేడుకలో వర్క్ ప్రెజర్ మరియు ఒత్తిడి కారణంగా ప్రవీణ్ తన భార్యకు శారీరకంగా దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని వారాలు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది.
వైద్య పరీక్షలు
దీంతో అనుమానం పెంచుకున్న చందన, వైద్య పరీక్షలు చేయాలని ప్రవీణ్‌పై ఒత్తిడి చేసింది. వైద్య నివేదికలో లైంగికంగా ప్రవీణ్ బాగానే ఉన్నాడని, అయితే మానసిక ఆందోళన కారణంగా సాన్నిహిత్యానికి సమయం పడుతుందని తేలింది.
రిపోర్ట్ సానుకూలంగా ఉన్నప్పటికీ, చందన ప్రవీణ్‌ను నపుంసకుడిగా అవమానించడం మొదలు పెట్టింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పంచాయితీ పెట్టి, శారీరకంగా సరిగ్గా లేనందుకు గానూ రెండు కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ తనను మానసికంగా కుంగదీసిందని ప్రవీణ్ ఆరోపించాడు.
బలవంతంగా ఇంట్లోకి చొరబడి దాడి
జూన్ 5న ఈ బెదిరింపుల ఘటన జరగగా, ఆగస్టు 17న చందన బంధువులు రెచ్చిపోయారు. గోవిందరాజనగర్లోని ప్రవీణ్ ఇంట్లోకి బలవంతంగా చొరబడి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రవీణ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు.
దీంతో ప్రవీణ్ కేఎం గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్లో బెదిరింపులు, గృహ హింస, హత్యాయత్నం కింద తన భార్య , ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ విచిత్ర కేసు బెంగళూరులో సంచలనం సృష్టిస్తోంది.


