Bengaluru Metro Makes History: బెంగళూరు మెట్రో రైలు వ్యవస్థ చరిత్ర సృష్టించింది. బెంగళూరు మెట్రోలో తొలిసారిగా ఒక మానవ అవయవాన్ని విజయవంతంగా తరలించారు. ఈ అరుదైన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన లివర్‌ను బెంగుళూరు మెట్రో ద్వారా అత్యంత వేగంగా తరలించారు. ఇలాంటి సంఘటన దేశంలోనే ఇది రెండోసారి.
ఈ ఆపరేషన్ శుక్రవారం రాత్రి 8:38 గంటలకు వైదేహి ఆసుపత్రి నుంచి ప్రారంభమైంది. అక్కడ నుండి లివర్‌ను అంబులెన్స్‌లో వైట్‌ఫీల్డ్ మెట్రో స్టేషన్‌కు తరలించారు. వెంట ఒక డాక్టర్‌తో పాటు ఏడుగురు సభ్యుల వైద్య బృందం కూడా ఉన్నారు. మెట్రో స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, అవయవానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, భద్రతా తనిఖీలను పూర్తి చేశారు.
రాత్రి 8:42 గంటలకు మెట్రో రైలు వైట్‌ఫీల్డ్ స్టేషన్ నుంచి బయలుదేరి, రాత్రి 9:48 గంటలకు రాజరాజేశ్వరి నగర్ మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ మెట్రో సిబ్బంది అత్యంత వేగంగా లివర్‌ను సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లోకి మార్చారు. ఆ అంబులెన్స్ వెంటనే లివర్‌ను స్పర్శ్ హాస్పిటల్‌కు తరలించింది. అక్కడ రోగికి కీలకమైన మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు.
ఈ ప్రక్రియ మొత్తం కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్గదర్శకాలకు కట్టుబడి జరిగింది. బెంగళూరు మెట్రో సాధించిన ఈ మైలురాయి దేశంలో అవయవ మార్పిడి రంగంలో సరికొత్త ఆశలను రేకెత్తించింది.


