నిర్బంధించి, వివస్త్రను చేసి, వీడియో తీసి..
బెంగళూరు, తెలుగుప్రభ :తీసుకున్న అప్పుకు అడ్డగోలు వడ్డీ డిమాండ్ చేస్తూ ఓ మహిళను కిడ్నాప్ చేసి, నిర్బంధించి, విచక్షణారహితంగా దాడి చేసిన అమానవీయ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. రూ.1.5 లక్షల రుణానికి ఏకంగా రూ.11 లక్షలు చెల్లించాలంటూ ఆమెను నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా, వివస్త్రను చేసి వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పని ఇప్పిస్తానని తీసుకెళ్లి…
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు (30) రెండేళ్ల క్రితం నజత్ బేగం అనే మహిళ వద్ద రూ.50 వేలు, రేష్మా బాను వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకుంది. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్ది వారాలుగా వాయిదాలు చెల్లించలేకపోయింది. దీంతో ఆగస్టు 27న బాధితురాలికి ఏదో పని ఇప్పిస్తానని, డబ్బులిస్తానని చెప్పి నజత్ బేగం మెట్రో లేఅవుట్లోని తన ఇంటికి పిలిపించింది. బాధితురాలు తన మైనర్ కుమారుడితో కలిసి అక్కడికి వెళ్లగా.. రేష్మా, ఆమె భర్త సుహెల్, మరో ఇద్దరు కలిసి ఇంట్లోకి చొరబడి దాడికి దిగారు.
రూ.11 లక్షలు చెల్లించాలని కత్తితో బెదిరింపులు
నిందితులు బాధితురాలిని కత్తితో బెదిరించి, ఆమె ఫోన్ను పగులగొట్టారు. వడ్డీతో కలిపి రూ.11 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితురాలిని, ఆమె కుమారుడిని ఆటోలో కుంబాల్గోడులోని రేష్మా బానుకు చెందిన ఇంటికి తరలించి గదిలో బంధించారు. అక్కడ కర్రలతో కొడుతూ తీవ్రంగా వేధించారు. ఆగస్టు 29న బాధితురాలి దుస్తులను బలవంతంగా తొలగించి, అర్ధనగ్నంగా మార్చి సెల్ఫోన్లో వీడియోలు చిత్రీకరించారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామని, వ్యభిచారంలోకి దించుతామని సుహెల్ బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం ఆమె కుమారుడిని బామ్మ ఇంటికి పంపించివేశారు. ఆగస్టు 30న సిటీ మార్కెట్ సమీపంలోని ఓ న్యాయవాది వద్దకు తీసుకెళ్లి కొన్ని పత్రాలపై బలవంతంగా సంతకాలు కూడా చేయించుకున్నారు.
పోలీసుల సమయస్ఫూర్తితో విముక్తి
ఆగస్టు 31న మధ్యాహ్నం నిందితులు తలుపు తీసిన సమయంలో మహిళ సమయస్ఫూర్తితో పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన చంద్ర లేఅవుట్ పోలీసులు కుంబాల్గోడులోని ఇంటిపై దాడి చేసి బాధితురాలిని రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నజత్ బేగం, రేష్మా బాను, సుహెల్, సైఫ్లపై కిడ్నాప్, అక్రమ నిర్బంధం, దాడి, బెదిరింపులు తదితర నేరాల కింద భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), ఐటీ చట్టం సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నజత్ బేగం, రేష్మా బాను, సుహెల్లను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న సైఫ్ సహా మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

