Bharat Taxi ride-hailing app : ఓలా, ఉబర్.. ఈ యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలపై ఆధారపడని నగరవాసులు లేరు. కానీ, అధిక ధరలు, విపరీతమైన కమీషన్లతో ప్రయాణికులు, డ్రైవర్లు ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగుతోంది. ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో సరికొత్త రైడ్-హెయిలింగ్ సేవలను ప్రారంభించనుంది. అసలు ఏమిటీ భారత్ ట్యాక్సీ? ఇది ఓలా, ఉబర్‌లకు గట్టి పోటీ ఇవ్వగలదా? దీనివల్ల డ్రైవర్లకు, ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలేంటి?
ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్ల దోపిడీకి చెక్ పెట్టేందుకు, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ సంయుక్తంగా ‘భారత్ ట్యాక్సీ’ యాప్‌ను అభివృద్ధి చేశాయి.
పైలట్ ప్రాజెక్ట్: తొలి దశలో, పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ ఏడాది నవంబర్ నుంచి ఢిల్లీలో ఈ సేవలను ప్రారంభించనున్నారు. 650 మంది డ్రైవర్లతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
దేశవ్యాప్త విస్తరణ: 2026 మార్చి నాటికి, ముంబయి, పుణె, హైదరాబాద్, బెంగళూరు సహా 20కి పైగా మెట్రో నగరాలకు ఈ సేవలను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
డ్రైవర్లకు ఎలా మేలు చేస్తుంది? : ఈ ‘భారత్ ట్యాక్సీ’ ప్రధానంగా డ్రైవర్ల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుంది.
కమీషన్ ‘సున్నా‘: ఓలా, ఉబర్‌లు డ్రైవర్ల సంపాదన నుంచి 25% వరకు కమీషన్‌గా తీసుకుంటుంటే, భారత్ ట్యాక్సీలో ఎలాంటి కమీషన్ ఉండదు.
స్వల్ప ఫీజు: డ్రైవర్లు కేవలం సభ్యత్వ రుసుము (membership fee) కింద నామమాత్రపు మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల, డ్రైవర్లు తమ సంపాదనలో అధిక వాటాను తామే ఉంచుకోవచ్చు.
ఇది కార్పొరేషన్ కాదు.. సహకార సంఘం : ‘భారత్ ట్యాక్సీ’ ఒక ప్రైవేట్ కంపెనీలా కాకుండా, సహకార సంఘం (Cooperative Society) మాదిరిగా పనిచేస్తుంది. ‘సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్’ దీనిని నిర్వహిస్తుంది. లాభాలన్నీ ఏ ఒక్క కంపెనీకో కాకుండా, డ్రైవర్లకే చెందుతాయని కేంద్ర మంత్రి అమిత్ షా గతంలోనే ప్రకటించారు.
యాప్ ఎలా ఉపయోగించాలి : ఈ యాప్‌ను ఉపయోగించడం కూడా ఓలా, ఉబర్ మాదిరిగానే సులభంగా ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు తమ తమ యాప్ స్టోర్ల నుంచి “భారత్ ట్యాక్సీ” యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను, త్వరలో ఇతర ప్రాంతీయ భాషల్లోకి కూడా తీసుకురానున్నారు. ఈ ప్రభుత్వ రంగ ప్రవేశంతో, ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్ల మధ్య పోటీ పెరిగి, ధరలు తగ్గుముఖం పడతాయని, అంతిమంగా ప్రయాణికులకు, డ్రైవర్లకు ఇద్దరికీ మేలు జరుగుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


