Saturday, November 15, 2025
HomeTop StoriesGolden Sweet: మిఠాయిల్లో మహారాణి.. కేజీ ధర రూ.36,000!

Golden Sweet: మిఠాయిల్లో మహారాణి.. కేజీ ధర రూ.36,000!

Luxury Indian Sweets : పండగ వేళ నోరు తీపి చేసుకోవడం మన సంప్రదాయం. కానీ, ఆ తీపికి బంగారం పూత పూస్తే..? కేవలం తినడానికే కాదు, చూసి మురిసిపోవడానికే వేలు, లక్షలు ఖర్చుపెట్టే రోజులివి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఓ మిఠాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాని ధర వింటేనే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. కిలో అక్షరాలా ముప్పై ఆరు వేల రూపాయలు! సామాన్యుడి నెల జీతంతో సమానం. అసలు ఆ స్వీటులో వాడింది పంచదార, పప్పులేనా లేక మేలిమి బంగారమా..? కేవలం బంగారు పూతకే అంత ధరా..? లేక దాని తయారీ వెనుక మరేదైనా రహస్యం దాగుందా..?

- Advertisement -

భోపాల్‌లోని ఓ మిఠాయి దుకాణం దీపావళి సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ ‘బంగారు మిఠాయి’ని ప్రత్యేకంగా పరిచయం చేసింది. సాధారణంగా నాణ్యమైన స్వీటు కేజీ రూ.700 నుంచి రూ.1000 మధ్య ఉంటుంది. కానీ, దీని ధర ఏకంగా రూ.36,000 పలకడం వెనుక బలమైన కారణాలున్నాయని దుకాణం యజమాని నవ్య మీడియాకు వివరించారు. దాని తయారీ విధానం, వాడిన పదార్థాల వివరాలు ఇవిగో..

అరుదైన దినుసులు: ఈ స్వీటు తయారీలో వాడిన పదార్థాలు సామాన్యమైనవి కావు.
పిషోరి పిస్తా: ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పిస్తా రకం. దీన్ని అఫ్గానిస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకుని, కశ్మీర్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పండిస్తారు. దీని రుచి, సువాసన అమోఘం.
చిల్గోజా గింజలు: హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్, కిన్నౌర్ వంటి హిమాలయ ప్రాంతాలతో పాటు అఫ్గానిస్థాన్‌లో మాత్రమే లభించే అరుదైన, ఖరీదైన నట్స్ ఇవి.
వాల్‌నట్స్, కుంకుమ పువ్వు: అత్యుత్తమ నాణ్యత కలిగిన కశ్మీరీ వాల్‌నట్స్, స్వచ్ఛమైన కుంకుమ పువ్వును మాత్రమే వినియోగించారు.
బంగారు పూత: ఈ మేలిమి దినుసులతో తయారుచేసిన మిఠాయిపై, తినదగిన స్వచ్ఛమైన బంగారు పూత (Gold Leaf) వేశారు. ఈ బంగారు రేకు ధర కూడా చాలా ఎక్కువ. అందుకే ఈ స్వీటుకు ‘బంగారు మిఠాయి’ అని పేరు వచ్చింది, ధర కూడా ఆకాశాన్నంటింది.

సూరత్‌లోనూ ఇదే దారి… ముక్క రూ.1400 : ఇలాంటి ఖరీదైన మిఠాయిల ట్రెండ్ మన దేశానికి కొత్తేమీ కాదు. గతంలో గుజరాత్‌లోని సూరత్‌లో ‘ఘరీ’ అనే స్వీటు కూడా ఇలాగే వార్తల్లో నిలిచింది.

గోల్డెన్ ఘరీ: ‘చండీ పద్వా’ పండుగ సందర్భంగా సూరత్‌లో తయారుచేసే ఈ ప్రత్యేకమైన ‘ఘరీ’ స్వీటుకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. కేవలం ఒక్క ముక్క (పీస్) ధరనే రూ.1400 పలుకుతోంది.

తయారీ ప్రత్యేకత: అత్యంత నాణ్యమైన ఎండు ఫలాలు, స్వచ్ఛమైన నెయ్యి, 24 క్యారెట్ల బంగారు రేకుతో దీన్ని తయారు చేస్తారు. ఇది 15 రోజుల వరకు పాడవకుండా ఉండటం దీని మరో ప్రత్యేకత.

ధరల ప్రభావం: గత ఏడాది రూ.1,100కి అమ్మిన ఈ గోల్డెన్ ఘరీ ముక్క, బంగారం ధరలు పెరగడంతో ఈ ఏడాది రూ.1400కి చేరిందని నిర్వాహకులు చెబుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక, విదేశాల నుంచి కూడా దీనికి ముందస్తు ఆర్డర్లు వస్తున్నాయని వారు తెలిపారు. మొత్తం మీద, పండగ మార్కెట్‌లో తమ ప్రత్యేకతను చాటుకోవడానికి, సంపన్న వర్గాలను ఆకర్షించడానికి మిఠాయిల తయారీదారులు ఎంచుకుంటున్న ఈ కొత్త దారి.. స్వీట్లకు కూడా రాజసాన్ని అద్దుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad