Court Order on Bhopal Toxic Waste Disposal: భోపాల్ విష వాయువు లీకైన ప్రమాదంలోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ విష వ్యర్థాల నిర్వహణకు సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అత్యధిక జాగ్రత్తలు పాటిస్తూ ఈ విష వ్యర్థాలను భద్రతగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చేయాల్సిన చర్యలను కోర్టు స్పష్టం చేసింది. 2025 జనవరిలో కొంత విష వ్యర్థాలు అత్యంత సాంకేతిక పద్ధతుల్లో పిఠంపూర్ ప్రాంతంలోని పరిశ్రమా ప్రాంతానికి తరలింపు చేయబడిన సంగతి ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
అయితే భోపాల్ పట్టణానికి కేవలం 500 మీటర్ల దూరంలో విష వ్యర్థాలను నిల్వ చేయాలన్న ప్రతిపాదనను కోర్టు తిరస్కరించింది. అలా చేయటం ప్రమాదకరమని, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలకే ఈ చర్య వల్ల ముప్పు కలుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యర్థాల్లో పాదరసం చట్టప్రకారం ఆమోదిత లిమిట్ కంటే మించి ఉన్నందున ప్రజల నివాసాలకు దూరంగా.. భూగర్భ జలాలు, వ్యవసాయ ప్రాంతాలకు దూరంగా ఉండేలా ప్రభుత్వం తప్పనిసరిగా స్టోరేజీకి ప్లాన్ చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఈ విష వ్యర్థాల నిర్వహణకు ప్రపంచస్థాయి నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించింది కోర్ట్. దీనిపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది.
1984లో జరిగిన భోపాల్ గ్యాస్ లీక్ విపత్తు ఇప్పటికీ అక్కడి ప్రజల మదిలో మిగిలే ఉన్న గాయంలా ఉందని గుర్తుచేస్తూ.. న్యాయమూర్తులు “ఇలాంటి సందర్భాల్లో ఎంత జాగ్రత్త తీసుకున్నా తక్కువే” అన్నారు. ఇది మానవజీవనంపై న్యాయవ్యవస్థ చూపే కరుణను సూచించే తీర్పుగా కనిపిస్తోంది. తదుపరి చర్యల కోసం నవంబర్ 20, 2025 న విచారణ కొనసాగనుంది. అప్పటివరకు ప్రభుత్వం భద్రపరిచేందుకు కొత్త స్థలాల వివరాలు, నిపుణుల నియామకంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ తీర్పుతో బాధితులు, పర్యావరణ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా చేస్తున్న డిమాండ్లు కొంతవరకు న్యాయం పొందినట్లయ్యాయి.
కోర్టు తీర్పులో ముఖ్యమైన గమనించదగిన 4 అంశాలు..
1. భవిష్యత్తులో ప్రజల నివాస ప్రాంతాలకు దూరమైన, పర్యావరణ హితమైన, నీటి వనరుల నుంచి సరిగా దూరంగా ఉన్న స్థానాల్లో ఈ విష వ్యర్థాల నిల్వ, వ్యర్థ నిర్వాహణ తరవాతం చేయాలని ఆదేశించింది.
2. విష వ్యర్థాల్లో ఉన్న పాదరసం వంటి విషపదార్థాలు ఇప్పటికీ ప్రమాదకరమైన స్థాయిల్లో ఉన్నాయి. కాబట్టి వాటిని భద్రంగా నిర్వహించాలన్న స్పష్టమైన సూచన ఇచ్చింది.
3. ఒక అంతర్జాతీయ స్థాయి నిపుణుల బృందాన్ని నియమించి అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాలను ప్రతిపాదిత స్థలాల్లో భద్రపరిచే విధానాన్ని రూపొందించాలని కోర్టు ఆదేశించింది.
4. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ప్రమాదం భవిష్యత్తులో మరింత సంక్షోభాలకు దారితీయరాదని జాగ్రత్తలపై హెచ్చరించటం.


