Big relief for Gayatri Projects: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత టి. సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలోని గ్రాయత్రి ప్రాజెక్ట్స్ చెల్లించాల్సిన రూ. 5700 కోట్ల అప్పులు మాఫీ అయ్యాయి. గాయత్రి ప్రాజెక్ట్స్ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో దాఖలు చేసిన దివాలా పరిష్కార పిటిషన్ తాజాగా కొలిక్కి వచ్చింది. వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) కింద రూ.2,400 కోట్లు చెల్లించి కంపెనీని తిరిగి సొంతం చేసుకునేందుకు సంస్థ ప్రమోటర్లయిన మాజీ ఎంపీ టీ సుబ్బరామి రెడ్డి కుటుంబ సభ్యులు చేసిన ప్రతిపాదనకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), హైదరాబాద్ బెంచ్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగం గా రూ.750 కోట్లను సుబ్బిరామి రెడ్డి కుటుంబ సభ్యులు 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. కెనరా బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతల కమిటీ (సీఓసీ)లోని 97 శాతం మంది ఇందుకు ఆమోదం తెలపడంతో ఎన్‌సీఎల్‌టీ ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో గాయత్రి ప్రాజెక్ట్స్ నుంచి తమకు రావాల్సిన రూ.8,100 కోట్ల రుణ బకాయిల్లో రూ.5,700 కోట్లకు (70 శాతం) ఆశలు వదులుకున్నట్టయింది. గాయత్రి ప్రాజెక్ట్స్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల్లో కెనరా బ్యాంక్‌తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఐడీబీఐ బ్యాంక్ ఉన్నాయి. కాగా గాయత్రి ప్రాజెక్ట్స్ ఇప్పటికే రుణదాతల వద్ద రూ.115 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిసింది.
వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద రూ. 2400 కోట్లు..
గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీ సీనియర్ పొలిటిషియన్ టి. సుబ్బారెడ్డి కుటుంబానికి చెందింది. ఈ కంపెనీ ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే చాలా ప్రాజెక్టులను చేపట్టిన గాయత్రి ప్రాజెక్ట్స్ బ్యాంకుల నుంచి రూ.8100 కోట్ల రుణాల సేకరించింది. కానీ ఆశించిన మేర వ్యాపారం జరగకపోవడంతో కంపెనీ దివాళా తీసింది. బ్యాంకులకు తిరిగి డబ్బు చెల్లించలేక చేతులేత్తేసింది. దీంతో, ఎన్సీఎల్టీలో గాయత్రి ప్రాజెక్ట్స్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇచ్చిన అప్పు రికవరీ చేసుకోవడానికి కంపెనీని, కంపెనీ ఆస్తుల్ని విక్రయించేందుకు కెనరా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ప్రయత్నించింది. కానీ దివాళా తీసిన గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరికి సుబ్బరామిరెడ్డి కుటుంబసభ్యులే వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌తో ఎన్సీఎల్టీలో ప్రతిపాదన పెట్టారు. రుణదాతలకు రూ.8,100 కోట్ల బకాయిలకు బదులు రూ. 2400 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చారు. రూ. అయితే, దీనిలో 30 శాతం అనగా రూ.750 కోట్లు చెల్లించడానికి ప్రమోటర్లకు 90 రోజుల వ్యవధి ఇచ్చింది ఎన్‌సీఎల్‌టీ. మిగిలిన డబ్బులను కంపెనీ ఆస్తుల మానిటైజేషన్, ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధుల ద్వారా చెల్లించనున్నారు. అనంతరం, బ్యాంకులు ఈ రుణ ఖాతాను క్లోజ్ చేయాలని నిర్ణయించాయి.


