కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)కు ఊరట దక్కింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) కుంభకోణం(MUDA Scam)పై లోకాయుక్త పోలీసుల దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. కాగా ముడా స్కామ్ కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ స్కాంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందారనే ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు సామాజిక కార్యకర్తలు టి.జె.అబ్రహం, స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో సిద్ధరామయ్యపై కేసు నమోదైంది.
ఈక్రమంలోనే ఆయన సతీమణి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని హైకోర్టులో సవాల్ చేయగా.. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త పోలీసులు ఈ స్కామ్‌పై విచారణ జరుపుతున్నారు. అయితే లోకాయుక్త పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయలేదని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని స్నేహమయి కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ ఎం.నాగప్రసన్న గత నెల 28న తీర్పు రిజర్వు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించారు.