Saturday, November 15, 2025
Homeనేషనల్Indian రైల్వేస్టేషన్ : ఏడాదికి 15 రోజులే.. పితృదేవతల కోసం ఓ రైల్వే స్టేషన్!

Indian రైల్వేస్టేషన్ : ఏడాదికి 15 రోజులే.. పితృదేవతల కోసం ఓ రైల్వే స్టేషన్!

15-day railway station India : రైల్వే స్టేషన్ అంటే నిత్యం ప్రయాణికుల సందడి, రైళ్ల రాకపోకలతో కిటకిటలాడుతుంది. కానీ, మన దేశంలో ఏడాదికి 350 రోజులు మూసి ఉండి, కేవలం 15 రోజులు మాత్రమే తెరుచుకునే ఓ స్టేషన్ ఉందని మీకు తెలుసా? అవును, మీరు చదివింది నిజమే. పితృదేవతలను సంతృప్తిపరిచే పవిత్ర కార్యం కోసం ప్రత్యేకంగా పనిచేసే ఆ వింత స్టేషన్ ఎక్కడుంది..? దాని వెనుక ఉన్న ఆంతర్యమేంటి..? కేవలం పక్షం రోజుల కోసం రైల్వే శాఖ ఎందుకంత ప్రాధాన్యం ఇస్తోంది..?

- Advertisement -

ఆధ్యాత్మికతకు చిరునామా.. ఆ స్టేషన్ కథాకమామీషు : బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ‘అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్’ స్టేషనే ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ స్టేషన్, ఏడాది పొడవునా నిర్మానుష్యంగా ఉండి, కేవలం ‘పితృపక్ష’ మాసంలో మాత్రమే ప్రయాణికులతో ప్రాణం పోసుకుంటుంది.
ఈ స్టేషన్ సమీపంలోనే ‘పున్‌పున్‌’ నది ప్రవహిస్తోంది. స్థానికులు దీనిని ‘ఆదిగంగ’ అని, గంగా నది కంటే ప్రాచీనమైనదని భక్తితో పిలుస్తారు. పితృపక్ష మాసంలోని 15 రోజుల పాటు, ఈ నదీ తీరంలో తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుందని, వారికి మోక్షం కలుగుతుందని లక్షలాది మంది ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకంతోనే దేశ విదేశాల నుంచి భక్తులు ఈ 15 రోజులూ ఇక్కడికి పోటెత్తుతారు.

ఈ ఏడాది సందడి షురూ : ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 7న ప్రారంభం కావడంతో, ‘అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్’ స్టేషన్‌లో మళ్లీ సందడి మొదలైంది. సెప్టెంబర్ 21 వరకు ఈ స్టేషన్ భక్తులతో కిక్కిరిసిపోనుంది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పక్షం రోజుల పాటు దాదాపు 8 జతల ప్యాసింజర్ రైళ్లు ఈ ప్రత్యేక స్టేషన్‌లో ఆగుతాయి.

టికెట్ కౌంటర్ లేని విచిత్రం : ఈ స్టేషన్ మరో విచిత్రం ఏంటంటే, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉండదు. పిండ ప్రదానం కోసం వచ్చే భక్తులు సమీపంలోని ప్రధాన జంక్షన్ అయిన ‘గయ’ స్టేషన్‌కు టికెట్ కొనుగోలు చేస్తారు. మార్గం మధ్యలో ఈ ఘాట్ స్టేషన్‌లో దిగి, పున్‌పున్‌ నదిలో పితృ కార్యాలు పూర్తి చేసుకుని, తిరిగి అదే టికెట్‌పై గయకు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు.

సౌకర్యాలపై మిశ్రమ స్పందన : ఏడాదిలో కొద్ది రోజులే పనిచేసే స్టేషన్ కావడంతో ఇక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. అయితే, గతేడాదితో పోలిస్తే ఈసారి రైల్వే శాఖ కొన్ని మెరుగైన ఏర్పాట్లు చేసిందని స్థానిక ఉపాధ్యాయుడు శివపూజన్ కుమార్ తెలిపారు. “హైమాస్ట్ లైట్లు, రైల్వే పోలీసుల బందోబస్తు, తాగునీటి సౌకర్యం కల్పించారు.

కానీ ఇతర స్టేషన్లతో పోలిస్తే ఇవి తక్కువే,” అని ఆయన అన్నారు. పిండప్రదానం కోసం వచ్చిన విభా శ్రీవాస్తవ అనే భక్తురాలు మాట్లాడుతూ, “స్టేషన్‌లో ఏర్పాట్లు అంతగా బాగోలేవు, కానీ నదీ తీరంలో బస చేయడానికి, వాహనాల పార్కింగ్‌కు మంచి సౌకర్యాలు కల్పించారు,” అని తెలిపారు. ఏదేమైనా, ఒక ఆధ్యాత్మిక విశ్వాసం కోసం భారతీయ రైల్వే ఏళ్లుగా ఈ ప్రత్యేక సంప్రదాయాన్ని కొనసాగించడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad