Saturday, November 15, 2025
Homeనేషనల్5-Days CM : తొలి అడుగులోనే సీఎం.. ఐదో రోజే ఫుల్ స్టాప్! ఇంతకీ ఎవరాయన?

5-Days CM : తొలి అడుగులోనే సీఎం.. ఐదో రోజే ఫుల్ స్టాప్! ఇంతకీ ఎవరాయన?

Bihar’s shortest-serving Chief Minister : రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే! తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఓ అద్భుతమైతే, కేవలం ఐదు రోజుల్లోనే ఆ పదవిని వదులుకోవడం మరో విచిత్రం. ప్రేమ కోసం కన్నవారిని, ప్రజాసేవ కోసం ఆస్తులను వదులుకున్న ఓ యువనేత, రాజకీయ చదరంగంలో పావుగా మారి, చరిత్రలో ‘5 రోజుల ముఖ్యమంత్రి’గా నిలిచిపోయారు. ఇంతకీ ఎవరాయన..? బిహార్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఆ ఐదు రోజుల వెనుక ఉన్న అసలు కథేంటి..?

- Advertisement -

ప్రేమ కోసం.. పోరాటం : బిహార్‌లోని ఖగారియా జిల్లాకు చెందిన సతీశ్ ప్రసాద్ సింగ్ (జననం 1936) ఓ పెద్ద భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. ఉన్నత చదువుల కోసం ముంగేర్ వెళ్లిన ఆయన, అక్కడ జ్ఞానకళ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డారు. కులాంతర వివాహానికి కుటుంబం అంగీకరించకపోవడంతో, వారిని ఎదిరించి ప్రేమించిన యువతినే పెళ్లాడారు. ఫలితంగా కుటుంబానికి, దూరమయ్యారు.

రాజకీయ అరంగేట్రం.. ఆస్తుల అమ్మకం : సోషలిస్టు భావజాలంతో ప్రభావితమైన సతీశ్, రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1962లో పర్బట్టా అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర పార్టీ తరఫున పోటీ చేసేందుకు, తనకు వాటాగా వచ్చిన భూమిలో కొంత భాగాన్ని అమ్మి ఎన్నికల ఖర్చు భరించారు. కానీ ఓటమి పాలయ్యారు. 1964 ఉప ఎన్నికలోనూ మళ్లీ భూమి అమ్మి పోటీ చేసినా, పరాజయం తప్పలేదు. అయినా నిరాశ చెందకుండా, రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలోని సంయుక్త సోషలిస్ట్ పార్టీలో చేరి, 1967 ఎన్నికల్లో ఎట్టకేలకు విజయకేతనం ఎగురవేశారు.

బిహార్‌లో రాజకీయ సంక్షోభం.. తెరపైకి సతీశ్ : 1967 ఎన్నికలు బిహార్ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికాయి. కాంగ్రెస్ తొలిసారిగా మెజారిటీ కోల్పోవడంతో, విపక్షాలన్నీ కలిసి ‘సంవిద్’ కూటమిగా ఏర్పడి, మహామయ ప్రసాద్ సిన్హా నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, పదవుల పంపకంలో అసంతృప్తితో రగిలిపోతున్న బీపీ మండల్, కూటమిలో చీలిక తెచ్చి ‘శోషిత్ దళ్’ అనే కొత్త పార్టీ పెట్టారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నియామకాలపై సీఎం మహామయ ప్రసాద్‌తో విభేదించిన సతీశ్ ప్రసాద్, బీపీ మండల్‌కు మద్దతుగా నిలిచారు. ఈ రాజకీయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న కాంగ్రెస్, బయటి నుంచి మద్దతిచ్చి 1968 జనవరిలో మహామయ ప్రభుత్వాన్ని కూల్చేసింది.

ముఖ్యమంత్రి పీఠం.. ఐదు రోజులకే అంతం : మహామయ ప్రభుత్వం పడిపోగానే, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీపీ మండల్ వర్గానికి వచ్చింది. అయితే, రాజకీయ వ్యూహంలో భాగంగా బీపీ మండల్, ముఖ్యమంత్రి పదవికి అనూహ్యంగా తన సన్నిహితుడైన సతీశ్ ప్రసాద్ సింగ్ పేరును ప్రతిపాదించారు. దీంతో, తొలిసారి ఎమ్మెల్యే అయిన సతీశ్, బిహార్ ఆరో ముఖ్యమంత్రిగా 1968 జనవరి 28న ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు.

అయితే ఆ ఆనందం ఐదు రోజులకు మించి నిలవలేదు. గవర్నర్‌పై విద్యార్థుల దాడి ఘటనలో, నిందితులను అరెస్టు చేయాలని బీపీ మండల్ ఆదేశించగా, సీఎంగా ఉన్న సతీశ్ ప్రకాశ్ అందుకు నిరాకరించారు. ఈ విభేదాలను ఆసరాగా తీసుకుని, తెరవెనుక జరిగిన రాజకీయ మంత్రాంగం ఫలితంగా, సతీశ్ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేసి, బీపీ మండల్‌కు మార్గం సుగమం చేశారు. అలా ఆయన ముఖ్యమంత్రి ప్రస్థానం కేవలం ఐదు రోజుల్లోనే ముగిసింది.

కొద్ది రోజులే అయినా.. చెరగని ముద్ర : సీఎంగా పనిచేసింది ఐదు రోజులే అయినా, సతీశ్ ప్రసాద్ రైతుల పక్షపాతిగా తనదైన ముద్ర వేశారు. అప్పట్లో బిహార్‌లో పండించిన బంగాళాదుంపలను రాష్ట్రం వెలుపల అమ్మడంపై నిషేధం ఉండేది. సీఎం హోదాలో ఆయన ఆ నిబంధనను ఎత్తివేసి, రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛను కల్పించారు. ఈ ఒక్క నిర్ణయంతో ఆయన రైతుల మన్ననలు పొందారు.

రాజకీయం నుంచి సినిమాకు.. మళ్లీ వెనక్కి : ఈ రాజకీయ పరిణామాల తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరమైన సతీశ్, సినీ రంగంలోకి ప్రవేశించి ‘జోగి ఔర్ జవానీ’ అనే సినిమాకు దర్శకత్వం వహించి, నిర్మించారు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. తిరిగి ప్రజల కోసమే పనిచేయాలని నిర్ణయించుకుని, 1980లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. ఖగారియాను జిల్లాగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. తన జీవిత చరమాంకం వరకు ప్రజాసేవలోనే గడిపిన ఈ విలక్షణ నేత, 2020లో కరోనాతో కన్నుమూశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad