Bihar Assembly Election 2025 : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బిహార్‌లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక, సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ, పెను తుపానునే రేపుతోంది. ఈ సవరణ పేరుతో లక్షలాది ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’పై, ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తం ఓట్లలో కేవలం ఒక్క శాతం తొలగించినా చాలు, అనేక పార్టీల తలరాతలు తారుమారైపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తేజస్విని భయపెడుతున్న ఆ ‘ఒక్క శాతం’ లెక్కేంటి..? 35 నియోజకవర్గాల గెలుపోటములతో ఈ సవరణకు ఉన్న సంబంధమేమిటి..? ఈ ఓట్ల వివాదం వెనుక ఉన్న అసలు కథేంటి..?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్తును కొన్ని ఓట్ల శాతమే నిర్దేశించనుంది. అందుకే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒక శాతం ఓట్లను తొలగించడం అనేది సుమారు 35 కీలక నియోజకవర్గాల ఫలితాలను పూర్తిగా మార్చేస్తుందని ఆయన వాదిస్తున్నారు. ఆయన భయానికి 2020 అసెంబ్లీ ఎన్నికల గణాంకాలే నిలువుటద్దం పడుతున్నాయి.
ALSO READ: https://teluguprabha.net/national-news/supreme-court-ruling-on-toilets-in-courts/
గణాంకాలు చెబుతున్న వాస్తవాలు: తేజస్వి ఆందోళనను అర్థం చేసుకోవాలంటే, ఈ లెక్కలను పరిశీలించాల్సిందే.
ఒక్క శాతం ప్రభావం: బిహార్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 7.90 కోట్లు. ఇందులో ఒక శాతం అంటే దాదాపు 7.90 లక్షల ఓట్లు. దీనిని 243 నియోజకవర్గాలకు విభజిస్తే, ప్రతి నియోజకవర్గంలో సగటున 3,251 ఓట్లు గల్లంతవుతాయి.
35 సీట్ల తలరాత: 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 35 నియోజకవర్గాల్లో గెలుపోటముల మధ్య తేడా 3,200 ఓట్ల కంటే తక్కువగా ఉంది. కొన్నిచోట్లైతే ఈ తేడా వందల్లో, పదుల్లోనే ఉంది.
హిల్సా: ఇక్కడ ఆర్జేడీ అభ్యర్థి కేవలం 12 ఓట్ల తేడాతో జేడీయూ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
బర్బీధా: కాంగ్రెస్ అభ్యర్థిపై జేడీయూ అభ్యర్థి గెలిచింది కేవలం 113 ఓట్ల తేడాతోనే ఓటమి చవిచూశారు.
రామ్‌గఢ్: ఆర్జేడీ అభ్యర్థి కేవలం 189 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గం నుంచి సగటున 3,200 ఓట్లను తొలగిస్తే, గత ఎన్నికల ఫలితాలు తలకిందులయ్యే ప్రమాదం ఉందని తేజస్వి వాదిస్తున్నారు.
విపక్షాల వాదన – అధికార పక్షం ప్రతిదాడి: ఈ ఓట్ల తొలగింపు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ప్రతిపక్షాల ఆరోపణ: ఈ సవరణ ద్వారా వెనుకబడిన, దళిత, మైనారిటీ ఓటర్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని తేజస్వి ఆరోపిస్తున్నారు. ఓటరుగా గుర్తించడానికి కోరుతున్న 11 పత్రాలతో పాటు, ఆధార్, రేషన్ కార్డు వంటివి కూడా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రక్రియలో పారదర్శకత లేదని, దరఖాస్తు స్థితిని తెలుసుకునే వ్యవస్థ కూడా లేదని మండిపడుతున్నారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/isro-spends-550-crore-axiom-mission-gaganyaan/
అధికార పక్షం కౌంటర్: ఈ ఆరోపణలను బీజేపీ, జేడీయూ ఖండిస్తున్నాయి. ఓటమి భయంతోనే తేజస్వి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, బోగస్ ఓటర్లకు ఆయన మద్దతిస్తున్నారని వారు ప్రతిదాడి చేస్తున్నారు. ఈ రాజకీయ రగడ ఎలా ఉన్నా, బోగస్ ఓటర్లను తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. అయితే ఈ ప్రక్రియ ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా, అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరగాలని, తొలగించిన ప్రతి ఓటుకు సరైన కారణం చెప్పాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. ఈ వివాదం బిహార్ ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.


