Bihar Assembly election campaign : బిహార్ ఎన్నికల సంగ్రామంలో కీలకమైన రెండో అంకానికి తెరలేవనుంది. మాటల తూటాలు, హామీల వర్షంతో హోరెత్తిన ప్రచారానికి ఆదివారంతో తెరపడింది. అధికార, విపక్ష కూటములు చివరి నిమిషంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాయి. “సీఎం కుర్చీ ఖాళీ లేదు” అని ఎన్డీఏ ధీమా వ్యక్తం చేస్తుంటే, “ఒక్క అవకాశం ఇవ్వండి” అంటూ మహాకూటమి అభ్యర్థిస్తోంది. మొత్తం 122 నియోజకవర్గాల భవితవ్యాన్ని నిర్దేశించే ఈ దశలో ప్రచార పర్వం ఎలా సాగింది? నేతలు సంధించిన అస్త్రశస్త్రాలేంటి?
సీఎం కుర్చీ ఖాళీ లేదు: అమిత్ షా : రెండో దశ ప్రచారానికి చివరి రోజైన ఆదివారం, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ససారాం, అర్వాల్‌లలో సుడిగాలి పర్యటన చేశారు. మహాకూటమిలోని అంతర్గత కలహాలను లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “బిహార్‌లో ముఖ్యమంత్రి పదవికి ఖాళీ లేదు. ఎన్డీఏ కూటమి ఐక్యంగా ఉంది, నితీశ్ కుమార్ నాయకత్వంలోనే మళ్లీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం,” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపక్ష కూటమికి అధికారం ఇస్తే రాష్ట్రం మళ్లీ అరాచకత్వంలోకి వెళ్తుందని, అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన హెచ్చరించారు.
ప్రధానిపై రాహుల్, తేజస్వీల ఎదురుదాడి : మరోవైపు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రధాని మోదీపై ‘ఓట్ల దొంగతనం’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని, ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ‘ఇండియా’ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. నిరుద్యోగం, వలసలు వంటి ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ, తాము అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాల కల్పనే మొదటి ప్రాధాన్యత అని ఆయన పునరుద్ఘాటించారు.
నవంబర్ 11న పోలింగ్ : రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించడంలో అత్యంత కీలకమైన ఈ రెండో దశలో మొత్తం 122 స్థానాలకు నవంబర్ 11, మంగళవారం నాడు పోలింగ్ జరగనుంది. ఈ దశలో పలువురు మంత్రులు, సీనియర్ నేతల భవితవ్యం తేలనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే నవంబర్ 14న జరిగే ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడాల్సిందే.


