Bihar Elections 2025 Muslims Impcat: దేశం మొత్తం ఇప్పుడు బీహార్ ఎన్నికల వైపు చూస్తోంది. ఎన్డీఏ, ఇండియా కూటమిలతో పాటు కొత్తగా మజ్లిస్, జన సురాజ్ పార్టీలో బరిలో ఉండటంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈసారి ముస్లిం ఓట్లు ఎటువైపనేది చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.43 కోట్లు కాగా అందులో ముస్లిం ఓటర్ల సంఖ్య 2.3 కోట్లు అంటే దాదాపుగా 18 శాతం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగనుండగా ఫలితాలు 14వ తేదీన వెలువడనున్నాయి. కాంగ్రెస్-ఆర్జేడీ భాగస్వామ్యంగా ఉన్న ఇండియా కూటమి వర్సెస్ జేడీయూ-బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్న ఎన్డీఏ మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. దీనికితోడు ఈసారి మజ్లిస్ పార్టీ ఏకంగా 100 స్థానాల్లో పోటీ చేస్తుండటం, ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జనసురాజ్ పార్టీ రంగంలో ఉండటంతో చతుర్ముఖ పోటీ నెలకొంది. బీహార్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉండటంతో అందరి దృష్టీ ముస్లిం ఓటు బ్యాంకుపై పడింది. ఈసారి ముస్లిం ఓటర్లలో మార్పు వస్తుందా లేక సాంప్రదాయక మార్గమే కొనసాగనుందా అనేది ఆసక్తి కల్గిస్తోంది.
మజ్లిస్, జనసురాజ్ పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చనున్నాయా
2020 ఎన్నికల్లో ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలోని 24 స్థానాల్లో 20 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం 5 స్థానాలు గెల్చుకుంది. కాంగ్రెస్ 7 స్థానాలకు పరిమితమైంది. అదే సమయంలో ఎన్డీఏ మాత్రం ఏకంగా 12 సీట్లలో విజయం సాధించింది. అంటే మజ్లిస్ ముస్లిం ఓట్లను చీల్చడంతో ఎన్డీయేకు లబ్ది చేకూరిందనేది అందరికీ తెలిసిన సత్యం. ఈసారి మజ్లిస్ పార్టీ ఏకంగా 100 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక జనసురాజ్ పార్టీ 243 స్థానాల్లో పోటీ చేస్తూ 40-20 ఫార్ములా అవలంభిస్తోంది. అంటే 40 శాతం హిందూవులు, 20 శాతం ముస్లింల ఓట్లను టార్గెట్ చేసింది. అందుకే ముస్లిం ఓట్లను ఈ రెండు పార్టీలు ఏ మేరకు చీల్చగలవనేది ఆసక్తిగా మారింది. ముస్లిం ఓట్లు ఎంత చీలితే ఎన్డీయేకు అంత ప్రయోజనం కలగనుంది.
బీహార్‌లో పట్టు పెంచుకుంటున్న ఆర్జేడీ-బీజేపీ
బీహార్ గత రెండు ఎన్నికలు అంటే 2015, 2020 పరిశీలిస్తే ఆర్జేడీ, బీజేపీలు క్రమంగా పట్టు పెంచుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలతో కలిసి ఉన్న కాంగ్రెస్, జేడీయూ మాత్రం పట్టు కోల్పోతున్నాయి. ముఖ్యంగా నితీష్ కుమార్ కు బీహార్ ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. 2015 ఎన్నికల్లో జేడీయూ 71 స్థానాలు సాధించగా 2020లో కేవలం 43 స్థానాలే గెల్చుకుంది. అంతేకాకుండా 2020-2025 మధ్యలో ఏక సమయంలో కూటమి మారుస్తూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత నితీష్‌దే. అందుకే ఆయనపై ప్రజల్లో గౌరవం తగ్గుతోంది. అదే సమయంలో తేజస్వి యాదవ్-రాహుల్ గాంధీపై విశ్వాసం పెరుగుతోంది. ఇది కచ్చితంగా ఎన్నికలపై ప్రభావం చూపించనుందని తెలుస్తోంది.
ముస్లిం ఓట్ల ప్రభావం
బీహార్ ఎన్నికల్లో 20 శాతం కంటే అధికంగా ఓటు బ్యాంకు కలిగిన 87 నియోజకవర్గాల్లో ముస్లింలు విజయావకాశాల్ని ప్రభావితం చేయనున్నారు. ఇక 15-20 శాతం ఓట్లు కలిగిన 47 నియోజకవర్గాల్లో కూడా ముస్లింలు గెలుపోటములు నిర్ణయించనున్నారు. ముస్లింలు చాలాకాలంగా సాంప్రదాయపరంగా ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి వైపే ఉన్నారు. ఓట్లు చీలితే ఎన్డీయేకు ప్రయోజనం కలుగుతుందనే అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమౌతోంది. జనసురాజ్, మజ్లిస్ పార్టీల మధ్య తమ ఓట్లు చీలితే అది కచ్చితంగా బీజేపీకు లబ్ది చేకూరనుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో ముస్లిం ఓట్లు చీలకుండా ఉండేలా కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ప్రయత్నిస్తోంది.


