Bhojpuri singers in Bihar politics : బిహార్ సాంస్కృతిక జీవనంలో భాగమైన భోజ్‌పురీ సంగీతం, ఇప్పుడు రాజకీయ రంగస్థలాన్ని హోరెత్తించబోతోంది. జానపద గళంతో కోట్లాది మంది ప్రజలను ఉర్రూతలూగించిన గాయనీగాయకులు, ఇప్పుడు ఓట్ల వేటకు సిద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఈ తారల చరిష్మాతో గెలుపు తీరాలను చేరాలని వ్యూహాలు పన్నుతున్నాయి. అసలు రాజకీయాల్లోకి వస్తున్న ఈ తారలెవరు…? వారి చేరికతో పార్టీల బలాబలాలు ఎలా మారనున్నాయి…? జానపద గళం.. జన తీర్పును మార్చగలదా..?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఈసారి ఎన్నికల బరిలో జానపద కళాకారుల హవా స్పష్టంగా కనిపిస్తోంది. తమ పాటలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న అనేకమంది భోజ్‌పురీ గాయకులు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతుండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. బీజేపీ నుంచి ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ వరకు, అన్ని శిబిరాలూ ఈ గాయకుల వైపు ఆశగా చూస్తున్నాయి.
ప్రధాన పార్టీల గాలం..
బీజేపీలో మైథిలీ ఠాకూర్: యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ (25) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌లతో భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ, “ఇది నా జీవితంలో కొత్త అధ్యాయం. ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను,” అని ప్రకటించారు.
చిరాగ్‌తో శిల్పి రాజ్ భేటీ: మరో ప్రముఖ గాయని శిల్పి రాజ్, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాసవాన్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
జన సురాజ్ జానపద బలం : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ, భోజ్‌పురీ తారలకు పెద్దపీట వేస్తోంది. ప్రముఖ గాయకుడు రితేశ్ రంజన్ పాండేను కర్గహర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దీనిపై రితేశ్ స్పందిస్తూ, “ఈ నేల నాది, ఈ ప్రజలు నావాళ్లు. వారి మద్దతు నాకే ఉంటుంది,” అని ధీమా వ్యక్తం చేశారు. మరో గాయకుడు అలోక్ కుమార్ కూడా జన్ సురాజ్‌లో చేరారు. అయితే ఆయన పోటీపై ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ ఆదేశిస్తే తప్పకుండా ఆలోచిస్తానని ఆయన తెలిపారు.
పవన్ సింగ్ వెనక్కి.. జ్యోతి సింగ్ ఎంట్రీతో ఉత్కంఠ : భోజ్‌పురీ పవర్‌స్టార్ పవన్ సింగ్ రాజకీయ ప్రవేశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గత లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, ఈసారి బీజేపీ తరఫున పోటీ చేస్తారని అందరూ భావించారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా, ఆర్‌ఎల్‌ఎం అధినేత ఉపేంద్ర కుష్వాహాతో ఆయన భేటీ కావడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. అయితే, అనూహ్యంగా అక్టోబర్ 11న తాను ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. సరిగ్గా ఈ ప్రకటనకు ఒక్కరోజు ముందు, ఆయన భార్య జ్యోతి సింగ్.. ప్రశాంత్ కిశోర్‌ను కలవడం ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
షహాబాద్‌పైనే అందరి కన్నూ : భోజ్‌పురీ, బక్సర్, రోహ్తాస్, కైమూర్ జిల్లాలను కలిపి షహాబాద్ ప్రాంతంగా పిలుస్తారు. ఇక్కడి ప్రజలపై భోజ్‌పురీ సంస్కృతి ప్రభావం ఎక్కువ. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 22 స్థానాల్లో ఎన్డీఏ కేవలం రెండింటిలో మాత్రమే గెలుపొందింది. ఈసారి భోజ్‌పురీ తారల ప్రభంజనంతో ఈ రాజకీయ సమీకరణాలను మార్చాలని పార్టీలు భావిస్తున్నాయి. “భోజ్‌పురీ కళాకారులకు ప్రజలతో సులభంగా మమేకమయ్యే శక్తి ఉంది. ఈ ఎన్నికల్లో వారిలో చాలామంది విజయం సాధిస్తారు,” అని బీజేపీ ఎంపీ, ప్రముఖ గాయకుడు మనోజ్ తివారీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న ఏకైక భోజ్‌పురీ గాయకుడు, వెస్ట్ చంపారన్‌లోని లౌరియా బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహారీ మాత్రమే.


