Bihar Elections 2025 Drugs and Liquor Seize: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఎన్నికల ప్రచారంలో డబ్బు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీ హడావుడి కూడా తగ్గేదే లే అన్నట్లుగా ఉంది. ఈ క్రమంలో బిహార్‌లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి ఇప్పటివరకు రూ. కోట్ల విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు ఉచితంగా పంచేందుకు తీసుకెళ్తున్న మద్యం, నగదు, డ్రగ్స్‌తో పలు వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులు వెల్లడించారు. కాగా, ఎన్నికల ప్రచారంలో డ్రగ్స్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: https://teluguprabha.net/national-news/udhayanidhi-stalin-diwali-wishes-tamilisai-controversy/
ఎన్నికల ప్రచారం నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 64.13 కోట్లు ఉంటుందని దర్యాప్తు సంస్థల అధికారులు తెలిపారు. ఈ మేరకు సోమవారం బిహార్ రాజధాని పాట్నాలో ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు. సీజ్ చేసిన వాటిలో మద్యం విలువే రూ. 23.41 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఇక రూ. 14 కోట్ల విలువైన వస్తువులు, రూ. 16.88 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నట్లు తెలిపారు. వీటితో పాటు రూ. 4.19 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన 753 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా 13,587 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామని వివరించారు. అయితే 2016 నుంచి బిహార్‌లో మద్యపాన నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోట్ల విలువైన మద్యం పట్టుబడటం గమనార్హం.
కాగా, బిహార్ ఎన్నికల్లో ఎక్కడా అవినీతి, ధన బలం అనేది లేకుండా చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టగా.. పోలీసు, ఎక్సైజ్, ఆదాయపు పన్ను, కస్టమ్స్, రెవెన్యూ, ఇంటెలిజెన్స్, ఈడీ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ మొత్తం స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని సీఈసీ ఆదేశించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో నవంబర్ 6, 11 తేదీల్లో జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.


