Bihar ministers’ electoral fate : బిహార్ ఎన్నికల కురుక్షేత్రంలో తొలి అంకానికి తెరలేచింది. ఈ నెల 6న జరగనున్న మొదటి విడత పోలింగ్, కేవలం అభ్యర్థుల తలరాతనే కాదు, ఏకంగా ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న 16 మంది మంత్రుల రాజకీయ భవిష్యత్తును కూడా నిర్దేశించనుంది. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, 14 మంది మంత్రులు బరిలో ఉన్న ఈ 16 నియోజకవర్గాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రులకు గెలుపు నల్లేరుపై నడకేనా? లేక ప్రజా వ్యతిరేకత, కుల సమీకరణాల రూపంలో పెను సవాళ్లు ఎదురుకానున్నాయా? వీరి ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
అందరి చూపు ఆ 16 స్థానాల వైపే : తొలి విడతలో 121 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, ఇందులో 11 చోట్ల భాజపా మంత్రులు, 5 చోట్ల జేడీయూ మంత్రులు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా, తొలిసారి అసెంబ్లీ బరిలో దిగుతున్న డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, సిట్టింగ్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా, ప్రతిపక్ష సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వంటి హేమాహేమీల భవితవ్యం ఈ విడతలోనే తేలనుంది.
డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి (తారాపుర్): తొలి అడుగు.. తండ్రి బాట : ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సామ్రాట్ చౌదరి, తొలిసారిగా తన సొంత జిల్లా ముంగేర్‌లోని తారాపుర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈ స్థానంతో ఆయన కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది. ఆయన తండ్రి, ప్రముఖ నేత శకుని చౌదరి ఏకంగా 23 ఏళ్ల పాటు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సామ్రాట్ తల్లి పార్వతీదేవి సైతం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు.
ప్లస్: బలమైన కుటుంబ నేపథ్యం, తండ్రికున్న పట్టు.
మైనస్: గత 30 ఏళ్లలో ఈ సీటును భాజపా ఒక్కసారి కూడా గెలవలేదు. జేడీయూ సిట్టింగ్ స్థానాన్ని ఇప్పుడు భాజపాకి కేటాయించారు.
పరీక్ష: ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గెలిస్తే, సామ్రాట్ రాజకీయ భవిష్యత్తుకు తిరుగుండదు. ఆయన సీఎం అభ్యర్థి అనే ప్రచారానికి బలం చేకూరుతుంది.
డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా (లఖీసరాయ్): హ్యాట్రిక్ వీరుడికి అసమ్మతి సెగ :
2010 నుంచి లఖీసరాయ్‌లో విజయ పరంపర కొనసాగిస్తున్న విజయ్ సిన్హాకు ఈసారి గెలుపు అంత సులువు కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ప్లస్: సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, నియోజకవర్గంపై పట్టు.
మైనస్: ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత, సొంత కూటమిలోనే కొందరు నేతల అసమ్మతి.
పరీక్ష: ఈ సవాళ్లను ఎదురీది గెలిస్తే, భాజపాలో ఆయన స్థాయి మరింత పెరిగి, తిరిగి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి.
మంత్రి మహేశ్వర్ హజారీ (కళ్యాణ్‌పుర్): ఇంట్లో పోరు.. బయట పోరు : జేడీయూ సీనియర్ మంత్రి మహేశ్వర్ హజారీ ఈసారి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు సన్నీ హజారీ, కాంగ్రెస్ తరఫున పోటీ చేసి, ఎన్డీయే కూటమి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
ప్లస్: సీనియర్ మంత్రిగా అనుభవం.
మైనస్: కుమారుడు వేరే పార్టీ నుంచి పోటీ చేయడంతో సొంత నియోజకవర్గంలో పట్టు సడలిందనే ప్రచారం. కుటుంబంలోనే రాజకీయ వైరం.
పరీక్ష: ఈ గందరగోళం మధ్య ఓటర్ల నమ్మకాన్ని గెలిచి, తన పట్టు నిరూపించుకోవడం ఆయనకు పెను సవాల్.
గెలుపు అంత సులువు కాదు: రాజకీయ నిపుణులు : “ఈసారి చాలామంది మంత్రులు వారి నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు విపక్ష మహా కూటమి సామాజిక, కుల సమీకరణాలను చాలా పక్కాగా చేసింది. ఇది మంత్రులకు పెను సవాల్‌గా మారనుంది,” అని రాజకీయ వ్యవహారాల నిపుణుడు అరుణ్ పాండే విశ్లేషించారు. “డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి వంటి నేతలు తప్పక గెలవాలి, లేదంటే వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది,” అని మరో విశ్లేషకుడు ప్రియ రంజన్ భారతి అభిప్రాయపడ్డారు.
ప్రజలు మా వెంటే: మంత్రి శ్రవణ్ కుమార్ : “మేం ప్రజలకు ఎంతో సేవ చేశాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. ప్రజలు మమ్మల్నే ఆశీర్వదిస్తారు. మంత్రిగా ఉన్నప్పుడు కొందరిలో అసంతృప్తి ఉండటం సహజం, కానీ చివరికి ఓటు మాకే వేస్తారనే నమ్మకం ఉంది,” అని సీఎం నితీశ్‌కు అత్యంత సన్నిహితుడు, నలంద అభ్యర్థి శ్రవణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద, ఈ 16 మంది మంత్రుల ఫలితాలు కేవలం వారి వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తునే కాకుండా, బిహార్ ప్రభుత్వ ప్రతిష్ఠను కూడా నిర్దేశించనున్నాయి. నవంబర్ 14న వెలువడనున్న ఫలితాలు ఎవరికి పట్టం కడతాయో వేచి చూడాలి.


